Philosophical Reflection: కవిత్వం ముందు బతుకు బోనమెత్తిన కవి
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:32 AM
ఈ విశ్వం ఒక బిందువు నుండి పెను విస్ఫోటనంతో (big bang) ఉద్భవించిందని నేటి శాస్త్రవేత్తల నమ్మకం. కొంతమంది శాస్త్రవేత్తలు అనూహ్యంగా విస్తరిస్తోన్న ఈ విశ్వం మళ్ళీ...
‘‘నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడగబోతే అవి...’’ – (శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’’ నుంచి)
1.
ఈ విశ్వం ఒక బిందువు నుండి పెను విస్ఫోటనంతో (big bang) ఉద్భవించిందని నేటి శాస్త్రవేత్తల నమ్మకం. కొంతమంది శాస్త్రవేత్తలు అనూహ్యంగా విస్తరిస్తోన్న ఈ విశ్వం మళ్ళీ సంకోచించి బిందువులోకే నిష్క్రమిస్తుందని కూడా నమ్ముతారు. సిద్ధార్థ గారి కొత్త కవితా సంపుటి ‘మల్లెల తీర్థం – మహా ఖననం’ చదవగానే భావావేశంతో ఉక్కిరిబిక్కిరయి కొన్నాళ్ళకు నిమ్మళించి ఆలోచించగా నాకు ఈ విషయమే జ్ఞప్తికి వచ్చింది. ఎందుకంటే జీవితాన్ని ఆవిష్కరించుకోవడం వ్యాకోచం వంటిదయితే, ఆవిష్కృతానంతర మానసికస్థితి సంకోచం వంటిది.
ఈ సంపుటిలో సిద్ధార్థ జీవంతమైన ఆకుపచ్చని భావాలు సిద్ధార్థ జీవంతమైన తెలంగాణా మాండలికంతో పాలూతేనెలవలె కలిసిపోయాయి. కవి visceral ప్రతీకల బలిమీ, అంతరంగపు నైర్మల్యమూ దేహాత్మల్లాగ కలిసి మనగలగడమొక wonder ! ఎప్పుడో ప్రాచీనకాలంలోనే దేవతలైన అమ్మతల్లులు అమ్మలై తల్లులై ఈ సంపుటిలో పునర్దర్శనమిచ్చి మనవారౌతారు. పాఠకులు తాము మెడ పైకెత్తి అంతెత్తు చూస్తేనే తప్ప కనిపించని archetypes ఈ స్త్రీలు, అలాగే పక్కకు తిరిగి చూసినా గతుక్కుమనిపించే స్వబాంధవులు. ఈ సంపుటి టైటిల్, ‘‘మల్లెల తీర్థం–మహాఖననం’’ అనడంలో Freudian దేవతాద్వయి – Eros & Thanatos – కదిలించిన శక్తులు పాఠకుల మనసుల్లో ఛాయలవలే జంటనృత్యాలు చేస్తూ వర్తమానం మొదలుకొని భవిష్యత్పథం మీదుగా సాగిపోతాయి. ఇది కవి మనకు అందిచ్చిన చేయూత.
సిద్ధార్థ గొంతు అనన్యం. ఏ సమకాలీన కవీ ఇటువంటి డిక్షన్‌తో ఇటువంటి వీధి గాలిలో తేలుతూన్న nuancesని ఒడిసిపట్టుకొని కవిత్వంగా మలచలేదు. జీవన వాస్తవికతను ఛిద్రశకలాల్లో ఆవిష్కరించిన కవులు చాలామందే ఉన్నారు గానీ సిద్ధార్థలా ethnic pluralismను గుర్తిస్తూ గుర్తింపునిస్తూ పదపదానా గుంపు అస్తిత్వవేదనను ప్రశ్నలతో వెతుక్కుని వాస్తవికతను వడబోసి అందీ అందని భాషను దాని పరిమితుల్ని పునర్వచించిన వారు మనకు లేరు. ఈ సంపుటిలో ఆధునికానంతరవాదులకు కావలసినంత ఉంది – Self– reflexivity, fragmentation సరైన మోతాదులో కనిపిస్తాయి. Intertextuality తళుక్కుమంటుంది, కొన్ని స్వరాల్ని వినిపిస్తుంది. సిద్ధార్థగారు వాదాల వెనుకా ఈ post– modern మాయాజలం వెనుకా నక్కి దాక్కోలేదు. జీవితాన్ని గౌరవిస్తూ బతుకు బోనాన్నే కవిత్వం ముందు ఎత్తేరు.
2.
సిద్ధార్థ కంటి ముందే నగరం మహానగరమయింది. మహానగరం గల్లీల్ని, పల్లెల్ని మింగేసి భూమిని తప్ప దేనినీ జీర్ణించుకోలేక మనుషుల్ని విసర్జించేసింది. చెట్టూ చేమా చెరువూ దొరువూ మాయమయ్యాయి. నగరం గర్భంలోనే మనిషి మరమనిషయ్యాడు. ఈ dehumanizing urbanizationలో ‘‘కోకిలలకు వనాల్లేక’’, ‘‘పిట్టలకు గూడు లేక’’, ‘‘కౌగిలికి దేహ మూ లేక’’ బాల్యాన్ని గడిపిన కవి తన చుట్టూ ఉన్న తనవారిని చూస్తూ తనను చూస్కుంటూ ఆక్రందిస్తూ ఏరుకున్న existential scraps ఈ కవిత్వమని తనే చెప్పుకున్నారు, స్వీయలిఖితమైన మున్నుడిలో. అస్తిత్వం అంటూ ఒకటుందా అనే సంశయమూ కవికి కలిగినట్టుంది. దాన్ని గురించి ఏ తర్జన భర్జనలు పడ్డారో గాని అదే మున్నుడిలో ‘‘అమ్మ గుండె చప్పుడును పిల్ల మాయి నుంచి అతికించి తెచ్చుకున్న నీ సోయి ఎప్పటికీ నీది కాదు’’ అన్న కవి రచనల్లో visceral ప్రతీకలు (‘మాయి’ అంటే placenta) మిక్కిలిగా కనిపించడం మానవాళిది ఒకే అస్తిత్వమనీనూ వ్యక్తులు తమ తమ time & spaceలో ఒకే తారను మీటుతూ అస్తిత్వచింతననూ అన్వేషణనూ అలా కొనసాగించాల్సిందే అన్న శాపం వంటి వరాన్ని తోడు తీసుకొని పిడెకిడు బూడిదయ్యేదాకా బతకాలి అనీనూ చెప్పినట్టే. ఈ స్పృహ ఈ సంపుటిలో పదే పదే పాఠకులను ఆవహించేదే. ‘‘నువ్వు మాత్రం చెప్పకుండానే ఒక రాత విప్పినవ్/ కొసవరకల్ల కర్మము తప్పదని/ చేసిన తప్పులు గోశిలవెట్టుకుని/తోకవీకాలెవ్వడైనా... అని’’ అన్న స్పృహ, ‘‘You are condemned to exist’’, అన్న దేవత దీవెన.
మహాఖననం అన్నమాట కేవలం మృత్యువుకే సంకేతం కాదు, తవ్విపారెయ్యడం అర్బన్ అమానవీయ ఆక్రమణ. ‘‘నీ వూరు లేదు. కాగితాలలో ఉరికొయ్యకు వేలాడుతూంది’’, లీగల్ కాగితాలే ఉరికొయ్యలు. ‘‘మోసపు వినయం మోసపు కారుణ్యం మోసపు లంజడితనం.../సినిమాను తిని సినిమాను తాగి సినిమాను షిట్ చెయ్యడం... కరెన్సీ రతి...’’, ఇదీ మహానగరంలో ఇవాళ్టి రియాలిటీ. ‘‘మా ఊరికి చేరుకోలేనిప్పుడు దారి పరాయిదయ్యింది’’, ఇది కవి పరాయీకరణ. ఈ అర్బన్ భూతానికి మంత్రోపచారంలా సాగే ప్రచారాల బాకా ఇలా ఉంటుంది, ‘‘ప్రచారమంతా/నగరాన్ని కరిచి/ రేబిస్ సోకి.. బతుకంతా పిచ్చెక్కి పాడుతుంది/ మీడియా... దాండియా ఆడుతుంది/ ఎవ్వని సిన్మా వానికి/ ఎవ్వని పంకా వానికి/ పగలగొట్టే.. తల్లి.. పగలగొట్టు/ నన్ను నీ కడుపులోకి మళ్ళీ తీసుకొని/ తగలబెట్టు.’’, అని అన్నప్పుడు ఎందుకో సీత రాముడ్ని విడిచి భూమాత గర్భంలోకే వెళ్ళిపోయిన వైనం గుర్తొస్తుంది. ‘‘కడియాలకు పట్నం పాము సుట్టుకుంది/ బొట్టునూ బట్టనూ కాటేసింది/ ఏం బతుకయ్యిందిరా కొడకా/ మనమంతా బతికే ఉన్నామా/నీ దర్మంగ జెప్పు/’’, అన్నదొక తల్లి కవితో, మహానగరంలో బతుకీడ్చలేక.
‘‘చిన్న దెబ్బకే నెత్తొరోడే ప్రతీకను.’’, అనుకున్న కవికి చుట్టూ ఉన్న తనవారే సగం బలం, దెబ్బ తగుల్తే పరుగెత్తి వచ్చి మందు వేసే దిక్కూ మొక్కూ వారే. ‘‘కష్టాలను పాములై పెంచుకుని/ కాటేయించుకుంటావ్/ విషమే ఎక్కదేందే నీకు/ మత్తెక్కించే గాయం నీ పొయెమ్’’, విషాదానికి ఉన్నది వికర్షణ కాదు, ఏదో ఆకర్షణే. దీన్ని కవిత్వీకరించడం కవుల బలహీనతో బలమో గానీ, ఏ కవీ విషాదాన్ని ప్రస్తావించకుండా ఉండలేడు. ‘‘నీలాంటోడు ఒకడో.. ఎవడో ఉంటాడు/కొన్ని దినాలల్ల/ వాడూ పోతాడు’’. ఇది కవిలోని మృత్యునిర్లిప్తతా లేక, genetic continuity ఉన్నదనే భరోసానా? మృత్యువు ఎలాగూ తప్పదు కనుక మృత్యుస్పృహను మాలిమి చేసుకోవడమే మంచిది. ‘‘ఏయ్... ఆగాగు నిన్నే.../ వెళ్ళకు... ముఖం తిప్పుకోకు/ కిటికీని సగం మాత్రమైనా తెరువ్/ బార్లా తెరవడం... చావు/ అది అందరిదీ.../ అంతిమంగా అందరమూ బార్లా తెరుచుకుని/ అమ్మ భూమిపై/ చేతులూ కాళ్ళు విరుచుకుని కూలిపోవాల్సిందే...’’, ఇది బతికినన్నాళ్ళూ ఉండాల్సిన జీవత్–స్పృహ. ‘‘నేను చావును చీమనై సమీపిస్తాను/ నా పాత గల్లీల్లోకి పారిపోతాను/ అది కొసవూపిరి ఊది పంపుతుంది.’’ మనిషి జీవచ్ఛవమై చావకూడదు. చచ్చేందుకూ జీవముంచుకోవాలి. ‘‘భూమ్మీద అందరికంటే ఎక్కువ ప్రేమించే/ పుణ్యాత్ముల వరుసలో/ ముందు నేనే ఉంటాను/ ఎవరూ ప్రేమించని శాపగ్రస్తుల/ వరుసలో వెనుక నేనే ఉంటాను.’’, గుంపు, గుంపు, గుంపు. గుంపే ముందు పుట్టి ఈ కవికి జన్మనిచ్చి ఇతన్ని తమ ప్రతినిధిగా ఇటు పంపింది. ‘‘నా లోపల ఒక స్త్రీ దేహముందని తెలుసు’’, అని జెండర్‌ను జయించినవాడే అనగలిగేది. ఈ కవి మున్నుడి లోనూ కవితల్లోనూ జీన్ మెమొరీల ప్రసక్తీ డీఎన్‌ఏల ప్రసక్తీ ఉన్నాయి. ఇది మందితో తాదాత్మ్యత. కవి కొన్నేళ్ళకు పెద్దవాడై ఏ బోధివృక్షపు నీడనో ఇలా ఉద్బోధిస్తున్నాడు:
‘‘నా మాటిను/ నువ్వు భాషలేకుండా వాక్యం తోడు లేకుండా/ అక్షరంతో కాలయాపన చెయ్యకుండా/ జరుగు/ వెనుదిరుగు/ వొక కాంతి కాలిబాటై పరుచుకుంటుంది/ జీవ ధార కురుస్తుంది/ అక్కడికి పో..పోపో/ వుత్త రాగధ్యానంగా నగ్న నిశ్శబ్దంగా/ కనువిప్పని కలింకాయ మొగ్గలాగ/ దాన్లోకి పోయి కూకో.../ నా మాటిను/కవిత్వం దొరుకుతుంది.’’ ఎక్కడ కవిత్వం దొరుకుతుందో కవి చెప్పినా, అక్కడికి ఎలా వెళ్ళాలో కవులే స్వయం కృషితో తెలుసుకోవాలి. కవితను రాయడమంటే కవితను చంపెయ్యడమేననీ, అచ్చు వెయ్యడమంటే దానికి సమాధి కట్టడమనీ నమ్మిన అజంతాను ఇక్కడ పాఠకులు తల్చుకుంటారు.
‘‘ఎగిరే సున్నానే నేను/మండే వానమబ్బుని/గంధపు చెదను’’, కవికి తనను తాను ఎలా నిర్వచించుకున్నా తనివి తీరకపోవడానికి కారణం ఈయన తన గుంపుకి ప్రతినిధి కావడమే.
‘‘తాటిచెట్ల నరాల్లో ప్రవహిస్తున్న ఆదిసూక్తాన్ని’’, ఈ వాక్యం చదివి పాఠకులు భూతభవిష్యత్కాలాలకున్న మామూలు అర్థాన్ని దాటి ఏ మహర్షి కల్పించిన time warp లోనో వేదమంత్రం వింటారు. ఎంత తియ్యగా ఉంది! అసలా తాటి చెట్టులో కల్లుందా అమృతముందా అని!
పుస్తకం పుర్తిచేశాక మనసులో సిద్ధార్థకి ప్రియమైన ఆడా, మగా, పిల్లా, పీచూ, ఇల్లూ, జాగా, బైరాగీ, పరివ్రాజకులూ – ఇవే కాక అందంగా ముక్కుపుల్లలూ మిగిలిపోతాయి. కవికి ముక్కు పుల్లలంటే ఎంటో ఇష్టమయినట్టుంది. ఎంతైనా నాసాభరణాలు స్త్రీలకు భర్తృవాల్లభ్యసూచకాలు. ఆ అందం ఇలా ఉంటుంది.
‘‘ఆమె కళ్ళు మూసుకుని నిద్రిస్తూంటే/ మెటఫర్‌నై జాగారం చేస్తున్నాను’’
‘‘చాలా సార్లు ఆమె దేహాన్ని పుస్తకంగా చదివాను/ వొక మత్తుకు లోనయ్యాను’’
3
మనిషి కేంద్రంగా గల్లీల నుంచి మహానగరంలో కాంక్రీట్ జంగల్ వరకూ జీవితాన్ని కవితాత్మకంగా ఆవిష్కరించిన ఈ సంపుటిని కవి సొంత గొంతుతో ఈ కవితలను చదివి పెట్టిన ఆడియోఫైల్స్‌తో పాటుగా మన కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా చేస్తే ఆధునిక తెలుగు కవిత ఇంకా బాగా బతుకుతుంది. అప్పుడు విద్యార్థినీవిద్యార్థులు ఇది చదివి ఎవరి విశ్వాన్ని వారు ఆవిష్కరించుకుంటారు. ఎవరి ethnic spiritual centreను వారు కనుక్కుంటారు. అవన్నీ ఒకే బిందువులోకి నిష్క్రమిస్తాయని నేననుకుంటున్నాను.
-వాసు
& 99011 55133