Share News

Chhaya Publications: కొత్త సాహిత్య వారధి విదేశీ సిరీస్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 03:14 AM

ఛాయా పబ్లికేషన్స్ సంస్థ విదేశీ సిరీస్ పేరుతో రానున్న రెండున్నర ఏళ్ళలో పదిహేను

Chhaya Publications: కొత్త సాహిత్య వారధి విదేశీ సిరీస్‌
Chhaya Publications

ఛాయా పబ్లికేషన్స్ సంస్థ ‘విదేశీ సిరీస్’ పేరుతో రానున్న రెండున్నర ఏళ్ళలో పదిహేను అంతర్జాతీయ భాషల నుంచి ౨౫ పుస్తకాలను తెలుగులోకి అనువదించి తేనుంది. ఇప్పటికే ఆయా ప్రచురణకర్తలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. ఈ సిరీస్‌లో ఒర్హాన్ పాముక్, హాన్ కాన్ వంటి నోబెల్ గ్రహీతల పుస్తకాలతోపాటు, బుకర్ ప్రైజ్ పొందిన రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయత్నం గురించి ఛాయ పబ్లికేషన్స్ సంస్థ సీఈవో అరుణాంక్ లతతో వివిధ జరిపిన సంభాషణ ఇది.


ఈ ‘విదేశీ సిరీస్‌’ ఆలోచన ఎలా కలిగింది, దీని ఉద్దేశం ఏమిటి? సమకాలీన ప్రపంచ సాహిత్యం తెలుగులోకి రావడం ఆగిపోయి దశాబ్దాలు గడుస్తోంది. ఈ లోటును తీరుస్తూ ఆ సాహిత్యాన్ని సామాన్య పాఠకులకు చేరువ చేసే ఉద్దేశ్యంతో ఈ సిరీస్‌ను ప్రారంభించాము. కొందరికే అందుబాటులో ఉండే ప్రపంచ సమకాలీన సాహిత్యాన్ని మారుమూల తెలుగు పాఠకులకు చేరవేయడం దీని లక్ష్యం.


ఇందులో పుస్తకాల్ని, రచయితల్ని ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేసుకున్నారు? ఒకే జాన్రా కాకుండా వేర్వేరు థీమ్స్, జాన్రాల నుండి తీసుకున్నాం. రచయితలూ, అనువాదకులూ అందరూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్నవారే. ముఖ్యంగా ఈ జాబితాలో బుకర్, బుకర్ ఇంటర్నేషనల్ బహుమతి పొందిన పుస్తకాలు, నోబెల్ బహుమతి పొందిన రచయితలూ ఉండేలా చూసుకున్నాం. వీటిలో బుకర్‌ బహుమతి పొందిన ఇంగ్లిష్‌ నవల ‘ప్రొఫెట్‌ సాంగ్’ (౨023); మూడు బుకర్ ఇంటర్నేషనల్ బహుమతులు పొందిన నవలలు: కొరియన్‌  నవల ‘ది వెజిటేరియన్’ (2016), డచ్‌ నవల ‘డిస్‌కంఫర్ట్‌ ఆఫ్ ది ఈవెనింగ్’ (2020), జర్మన్‌ నవల ‘కైరోస్’ (2024); అలాగే, ముగ్గురు నోబెల్ రచయితల పుస్తకాలు: నార్వేజియన్‌ రచయిత యాన్ ఫోసే నవల ‘షైనింగ్’ (2023), టర్కిష్‌ రచయిత ఒరాన్ పాముఖ్ నవల ‘మై నేమ్ ఈజ్ రెడ్’ (౧998), కొరియన్‌ రచయిత హాన్ కాంగ్ నవలలు ‘ది వెజిటేరియన్’ (2016), ‘వీ డు నాట్ పార్ట్’ (2025) ఉన్నాయి. వీటిలో రెండు పుస్తకాలు మినహాయిస్తే మిగతావన్నీ గడచిన ఇరవై ఏళ్ళలో వచ్చినవే.


ప్రచురణకర్తలతో ఒప్పందాలు సులభం గానే జరిగాయా? ఆయా ప్రచురణకర్తలు ఇలాంటి ఒప్పందాల విషయంలో ఏ అంశాలపై దృష్టి పెడతారు, ఇందులో ఆయా రచయితల పాత్ర ఎంతవరకు? హక్కులు అనేది కాస్త క్లిష్టమైన వ్యవహారమే. ఒక పుస్తకం మనం తీసుకోవాలి అని అనుకున్న తరువాత దాన్ని డీల్ చేసే సంస్థ ఏది అనేది వెతుక్కోవడం కూడా పెద్ద విషయమే. ఎక్కువగా విదేశీ రచయితలకు లిటరరీ ఏజెంట్స్ ఉంటారు. కొందరిని లిటరరీ ఏజెన్సీలు రిప్రజెంట్ చేస్తాయి. ఆ ఫలానా ఏజెన్సీలో తనను రిప్రజెంట్ చేసే ఏజెంట్ ఒకరు ఉంటారు. ఇవన్నీ కనుక్కుని వాళ్ళ ఈమెయిల్ ఐడీ తీసుకున్నాక వారికి రాసిన మెయిల్‌కి స్పందిస్తారని లేదు. వాళ్ళు చాలామందిని చూసుంటారు గనుక ఎక్కువ మంది మొదటి మెయిల్‌కే స్పందించరు. దానికి తోడు, మనం వేసే పుస్తకాల సంఖ్యా, మనం ఆఫర్ చేసే డబ్బులూ వాళ్ళకి పెద్ద విషయంలా అనిపించదు. రిపీటెడ్‌గా రాస్తే తప్ప ఈ ప్రపోజల్స్‌ వర్కవుట్ అవ్వవు. ఇందులో ఒకటీ రెండు ఈమెయిల్స్‌కే ఒప్పుకున్న వాళ్ళున్నారు, పదుల సంఖ్యలో ఈమెయిల్స్ రాస్తే తప్ప స్పందించనివాళ్ళూ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా ఎన్ని పుస్తకాలు వేస్తున్నారు, ఏ రకంగా వేస్తున్నారు అనే దానిపై దృష్టి పెడతారు. పుస్తకం పేపర్ బ్యాక్, హార్డ్ బౌండ్, ఆడియో రైట్స్ వేటికవే ప్రత్యేకంగా హక్కులు తీసుకోవాల్సిందే. ప్రచురణ సంస్థ గురించిన ఒక సవివరమైన పరిచయం కూడా వాళ్ళు తెలుసుకునేందుకు ఇష్టపడతారు. ఈ మొత్తం ప్రక్రియలో రచయితల పాత్ర దాదాపు ఉండదు అనే చెప్పొచ్చు. వారి తరఫున ఇదంతా నెగోషియేషన్స్ ఏజెంట్స్ నిర్వహిస్తారు. కాంట్రాక్ట్‌లో సంతకం చేయడం మాత్రమే రచయిత పని. ఎందుకంటే గత ఏడాది బుకర్ ఇంటర్నేషనల్ వచ్చిన రచయిత్రి జెన్ని ఎర్పన్‌బెక్‌నీ, 2023 బుకర్ వచ్చిన పాల్ లించ్‌నీ ప్రత్యక్షంగా కలిసినా కూడా వాళ్ళు తమ ఏజెంట్స్ తోనే మాట్లాడమని చెప్పారు.


ఈ సిరీస్‌లో అరబిక్‌, ఫినిష్‌, ఐస్‌లాండిక్‌, కొరియన్‌, నార్వేజియన్‌, రష్యన్‌ తదితర భాషల పుస్తకాలు ఉన్నాయి. వీటన్నిటి అనువాదమూ వయా ఇంగ్లీష్‌ అనువాదాల నుంచే జరుగుతున్నదా? రెండు పుస్తకాలు మినహా మిగతావన్నీ వయా ఇంగ్లీష్ నుంచి చేస్తున్నవే. అయితే, ఇంగ్లీష్ అనువాదకుల నుంచి వారి అనువాదాన్ని వాడుకునేందుకు హక్కులు తీసుకుంటున్నాం. ఇలా వాళ్ళని సంప్రదించడం చాలా అరుదైన విషయమనీ, చాలా భాషల్లోకి వారి అనువాదాలను ఉపయోగించే చేస్తున్నా కనీసం వారి పేరు కూడా పేర్కొనడం లేదని వారు అన్నారు. తమ అనువాద హక్కుల గురించి ఇప్పుడు వారంతా బయటకి వచ్చి సంఘటితం అవుతున్నారు.


రెండు తప్ప వీటిలో ఏ నవలా మూల భాష నుంచి నేరుగా రానప్పుడు తెలుగు అనువాదం మూలానికి మరీ ‌దూరంగా జరిగే అవకాశం లేదా? మూలం నుండి దూరం జరగకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రముఖ ప్రచురణ సంస్థలు వేసిన పుస్తకాలను, అనువాదకుల ప్రొఫైల్‌ని గమనంలో పెట్టుకునే పుస్తకాలను ఎన్నుకున్నాం. వీరంతా ప్రతి పుస్తకం ఐదారు సార్లు, కొందరు ఇంకా ఎక్కువ సార్లు ఎడిట్ చేస్తారు. తరచి తరచి చూసిన తర్వాతే ఈ పుస్తకాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్‌ లోకి వచ్చేటప్పుడు ‘ట్రాన్స్‌లేషన్ లాస్’ తక్కువ గనుక తెలుగులో ఆ సమస్య ఉండదనే అనుకుంటున్నాం.


తెలుగు అనువాదకుల ఎంపిక ఎలా జరుగుతోంది? అనువాదాల శైలి విషయంలో ఏమైనా నియమాలు విధించుకున్నారా? ఈ సిరీస్ ద్వారా కొత్త అనువాదకులను పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే అనువాదం చేసిన నలుగురు అనువాదకుల అనువాదాలను చూసి వారికి కొన్ని పుస్తకాలు ఇచ్చాం. అయితే, ఈ సిరీస్‌కి ముగ్గురు సంపాదకులను కేటాయించాం. వారు ఇంగ్లీష్ – తెలుగు అనువాదం చూడటం, మూలానికి దూరం కాకుండాను, అట్లే రీడబిలిటీ ఉండేలాను చూస్తారు. అంతేగాక రీడర్ రివ్యూ అనే పద్ధతినీ పాటిస్తున్నాం. ఎంపిక చేసిన పాఠకులకు అచ్చుకు ముందే పుస్తకాలు పంపించి ఎలా ఉందో రివ్యూలు తీసుకుంటున్నాం.


ప్రస్తుతం భారతీయ/ తెలుగు రీడర్‌షిప్‌ విషయంలో విదేశీ ప్రచురణకర్తల దృక్పథం ఎలా ఉంది? భారతీయ రీడర్‍‌‌షిప్‌ అంటే వారి దృష్టిలో ఇంగ్లీష్ రీడర్‌షిప్ మాత్రమే. ఒక్క మలయాళం మినహా మిగతా భారతీయ భాషల్లో అనువాద సాహిత్యం వేల కాపీలు అమ్ముడుపోయేదీ తక్కువే. భారతీయ భాషలు సంఖ్య ప్రకారం పెద్దవేగానీ రీడర్‌షిప్ ప్రకారం చిన్నవి. వారు ఈ విషయం చెబితే అర్థం చేసుకుంటున్నారు. ఒక కొత్త భాషలోకి పుస్తకం వెలుతుందిలెమ్మనే అభిప్రాయంతో ఉన్నారు. బహుశా ఈ పుస్తకాలు కొత్త మార్కెట్‌కి దారులు వేస్తాయేమోనన్న దృక్పథంతోనూ ఉన్నారు. ఈ ‘విదేశీ సిరీస్’ ప్రయాణంలో 15 భాషల నుంచి పుస్తకాలు తెస్తున్నాం గనుక, కేవలం మనం తేవడంతోనే ఆగిపోకుండా మన సాహిత్యాన్ని అటువైపు తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తున్నాం. త్వరలో మన పుస్తకాలూ ఫ్రెంచ్ వీధుల్లోనో, జర్మన్ బుక్ షాప్స్‌లోనో, అమెరికన్ మాల్స్‌లోనో... ఆయా భాషల్లో కనిపించొచ్చు.

-అక్బర్

Updated Date - Jul 21 , 2025 | 03:14 AM