Share News

వేదనాకాశం కింద చెహోవ్‌ హీరో

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:43 AM

ఒక లెక్కలేనితనం తెచ్చే అందంతో చూస్తుంటాయి చెహొవ్ కళ్ళు ఇప్పటికీ, తన ఫోటో ఎవరు చూస్తుంటే వాళ్ళ లోపలికి. తన కథలకు ఆకర్షణీయమైన పేర్లు అనవసరమనీ, ఏడేళ్ళకు మించి వాటికి పాఠకాదరణ...

వేదనాకాశం కింద చెహోవ్‌ హీరో

ఒక లెక్కలేనితనం తెచ్చే అందంతో చూస్తుంటాయి చెహొవ్ కళ్ళు ఇప్పటికీ, తన ఫోటో ఎవరు చూస్తుంటే వాళ్ళ లోపలికి. తన కథలకు ఆకర్షణీయమైన పేర్లు అనవసరమనీ, ఏడేళ్ళకు మించి వాటికి పాఠకాదరణ ఉండబోదనీ అనుకున్న ఈ రచయిత పేరు నూట నలభై సంవత్సరాలుగా ‘కథ’కు పర్యాయనామం అయి కూచుంది. మొదట్లో కేవలం సంపాదన కోసం హాస్యకథలు, ఏకాంక నాటికలూ రాస్తూ వచ్చిన చెహొవ్‌ను అన్న అకాల మరణం రచనకళ పట్ల, జీవితం పట్ల దృక్పథాన్ని మార్చుకునేట్లు చేసింది. అలా ఇరవై ఏడేళ్ళకే మరణ విచారణ, బ్రతుకుచింతన ఆయన కథల విషయం అయింది. అప్పుడు రాసినవే ‘The Tedious Story’, ‘The Kiss’.

‘‘మనిషికి తీవ్ర అస్తిత్వ వేదన నుంచి జాగృతి పుడుతుందా లేక తనకు ఆ స్పృహ వచ్చినప్పుడు మానవ అస్తిత్వ వేదన తెలుస్తుందా?’’ అనే సూక్ష్మ సందిగ్ధతను పదునుగా చెప్పిన కథలు ఈ రెండూ.


‘The Tedious Story’లో విషయం– అరవై పైబడిన ప్రొఫెసర్ నికొలాయ్ స్టెపనొవిచ్‌కు, అతని గార్డియన్షిప్‌లో కూతురిలా పెరిగిన పాతికేళ్ళ కేటీ కి జీవితం పట్ల వచ్చిన నిస్పృహ. అకస్మాత్తుగా శక్తిహీనత, మృత్యుస్పృహ వచ్చిపడ్డాక, స్టెపనొవిచ్, ‘‘నాకు ఎటువంటి ప్రఖ్యాతి! వృద్ధాప్యం, రోగాలు, మృత్యువు నాకెట్లా వస్తాయి? అద్దంలో ఆ వంకరనోటి ముఖం నాదేనా! శరీరంలో, మనసులో దౌర్బల్యం, బయట మనుషుల్లో నన్ను అర్థం చేసుకోలేని స్వార్థం! ఏ పని లోనూ అభిరుచి లేదు, భోజనం లోనూ తీవ్రమైన అరుచి. లోకంలో కళాకాంతీ పోయాయి!’’ అని వాపోతుంటాడు.

తనకు మృత్యువు వస్తోందనా, జీవితేచ్ఛ పోతున్నదనా దుఃఖం? ‘‘అరవై రెండేళ్ళ సుదీర్ఘ జీవితాన్ని ఎంత నిరర్థకంగా ఖర్చు చేసుకున్నాను కదా!’’ అనే జ్ఞానమా? ఇన్నాళ్ళూ తను గొప్పవి అని నమ్మి నెత్తిన పెట్టుకున్న జీవితవిలువలు ఉట్టి డొల్ల అని ఒప్పుకోవడం ఎంత దుర్భరమో, ఇప్పుడు వాటికి విరుద్ధంగా బ్రతకాలనే ప్రయత్నం అంతకన్నా కష్టం. ఇన్నాళ్ళుగా యాంత్రిక జీవనం అనే ఉరితాడును వరమాలనుకుని మెడకు వేసుకుని తిరిగానని తెలుసుకున్న నేరస్థులు చెహొవ్ పాత్రలు. జ్ఞానాన్ని మించిన నేరం, దుఃఖం లేవు.

ఇక, కేటీ విషాదకారణాలు ముసలితనమో, శారీరక అశక్తతో కావు. ఆమె తన నటనావృత్తిలోనూ, ప్రేమలోనూ ఓడిపోయింది. జీవితమంటే నిర్వేదం. తండ్రి వంటి స్టెపనొవిచ్‌ ముందు, ‘‘నేనిప్పుడు ఏం చెయ్యాలి ఈ ‘utter will–lessness’ (చెప్ప లేనంత నిరాసక్తత) నుంచి బయటపడే దారేది?’’ అని రోదిస్తూ ‘‘ఒక్కమాట చెప్పు, ఈ స్థితినుంచి దారి చూపించే ఒక్కమాట!’’ అంటుంది. కానీ, అటువంటి సంశయంలోనే కొట్టుకుపోతున్న స్టెపనొవిచ్‌ దగ్గర దానికి జవాబు లేదు. ఒక తండ్రిలా ఆమె కోసం దుఃఖిస్తూనే, ‘‘నిజంగా నాకూ తెలియడం లేదమ్మా’’ అంటూనే, ‘‘నా అంతఃకరణం ఏదో చెప్తున్నది కానీ ఆ విధంగా నడిచే ధైర్యమూ శక్తీ నాకిప్పుడు లేవు. దైవం ఏ శిక్ష వేస్తాడో వెయ్యనీ,’’ అంటాడు. తనను నడిపించిన సూత్రం, సత్యం ఇవీ అని చెప్పగల విద్య ఇన్నాళ్ళ అధ్యాపక అనుభవంలో నేర్చుకోలేదు ఆ ప్రొఫెసర్.


ఇక్కడ చెహొవ్ ఒక యూనివర్సిటీ చదువులనే బోనులో నిలబెట్టలేదు, వరసగా వస్తారు ఆయన ముద్దాయిలు– వివిధ సిద్ధాంతకారులు, ప్రభువులు, ప్రవక్తలూ, మనిషి ప్రియ వ్యసనాలైన అంతఃకరణశుద్ధి లేని కళలు, అబద్ధపు అభ్యుదయ సమా జపు కలలు, మోతాదు మించిన సైన్సు, సత్యాన్వేషణ కాని సాహి త్యం... ఇలా అన్నిటికీ మెల్లగా కీళ్ళు ఊడదీసి చల్లగా కూలదోసిన రచనలు చెహొవ్‌వి.

‘The Kiss’లో ఒక మిలిటరీ బెటాలియన్ ఒక పల్లెటూరిలో రాత్రికి బస చేయవలసి వస్తుంది. అలసిపోయిన జవాన్లు తొందరగా నిద్రపోదాం అని సిద్ధమవుతుంటే, ఆ ఊళ్ళోని రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్, వీళ్ళను విందుకు ఆహ్వా నిస్తాడు. ‘‘ఖర్మరా బాబూ’’ అనుకుంటూ వెళ్ళాక తెలుస్తుంది, పిలిచినవాళ్ళు కూడా ‘‘ఖర్మరా బాబూ’’ అనుకుంటూనే మర్యాద కోసం పిలిచారని. వాళ్ళింట్లో ఏదో శుభకార్యం, ఇంటి నిండా స్వజనం. వాళ్ళు ఇబ్బందిని దాస్తూ గౌరవాన్ని నటించగల అను భవజ్ఞులు కాబట్టి వీళ్ళకు చాలా శ్రద్ధగా తిండి, పానీయాలు పోసి, తమ డాన్స్, పియానో పాటల్లో కూడా కలుపుకుంటారు. జవాన్లు ఆ సంపన్నుల భవంతిలో, అప్సరసల వంటి ఆ ఇంటి స్త్రీల మధ్య, తమ ఉక్కిరిబిక్కిరితనాన్ని దాచిపెట్టి హూందాతనాన్ని తెచ్చిపెట్టుకుని తిరుగుతారు, ఒక్క ర్యాబోవిచ్‌ తప్ప. అతను కాస్త నటన చేసైనా మామూలు మనిషిలాగా కనపడటానికి వీలుకానంత చిన్న మనిషి– అందంలో, స్థాయిలో, నాగరీకంలో. దిక్కు తోచక ఆ ఇంట్లో ఉన్న లెక్కలేనన్ని గదులు తిరుగుతూ తిరుగుతూ తోవ మర్చిపోయి, సన్నగా సంగీతం వినపడుతున్న ఒక చీకటి గదిలోకి వచ్చి పడతాడు. ఆ చీకటి గదిలో విరగపూసిన పూలవాసన. గది కిటికీలు తోటలోకి తెరుచుకున్నట్లు ఉన్నాయి. ‘‘ఇది కాదు నేను రావలసిన గది’’ అనుకుంటుండగానే– స్త్రీ దుస్తుల రెపరెపలు వినపడటం, పరిగెత్తిన ఆయాసంతో ఆడగొంతు ‘‘దొరి కావు చివరికి’’ అనడం, పరిమళాల ఆడచేతులు రెండు తన మెడను చుట్టడమూ, వెచ్చటి చెంప తన చెంపకు ఆనటమూ, చటుక్కున ముద్దు! వెంటనే చిన్న కేక వేసి ఒక్క గెంతులో దూరంగా వెళ్లిపోయింది ఆమె ఎవరో! అతనికి అంత చీకట్లోనూ ఆమె అసహ్యం కనపడింది. ఆ ముద్దు తనది కాదని తెలిసింది. అయినా, ఉద్వేగంతో హృదయం కొట్టుకుంటోంది. పెనవేసుకున్న స్త్రీ చేతులు తన మెడకు ప్రసాదించిన పవిత్రతైలాల అనుభూతి పూతను వదిలించుకునే శక్తి అతనికి లేదు. ఈ మైకంలోనే మన హీరో మిగతా జవాన్లతో కలిసి బస వైపు నడుస్తాడు. సుష్టైన విందు పానీయాల మత్తుతో నడుస్తున్న జవాన్లు ‘‘ఎప్పటికైనా ఇలా ఇల్లు సంసారం ఏర్పడకపోతాయా మనలాంటి మామూలు మనుషులకు కూడా’’ అనుకుంటారు (ఈ మాట బరువు తూచలేము). ఎక్కడో ఒక కోయిల తన గుండెల్లో బలిమినంతా గొంతులోకి తెచ్చుకుని పాడుతున్నది. అంతటా ఆనందమే ఆ రాత్రి.


చెహొవ్ కథల్లో ఒక సుష్టైన విందు, సుందరమైన దృశ్యం, అందమైన స్త్రీ ఉనికి మనిషిలో దాదాపు పునర్జన్మ వంటి ఒక పరివర్తనం తీసుకురావటం తరచూ కనపడుతుంది.

మరుసటిరోజు ఆ మిలిటరీ బెటాలియన్‌ ఆ ఊరు విడిచి పోతుంది. ఆనాటి నుండి మళ్ళీ తిరిగివెళ్ళే ప్రయాణంలో ఇదే ఊర్లో ఆగటానికి మధ్య నూట మూడు రోజుల పొడవునా ర్యాబోవిచ్‌కు అనుభవమైన అందమైన అవస్థే ఈ కథకు ప్రాణం. ఆరోజు తనకు ప్రేమ దొరికిందనీ, తనదిప్పుడు విరహబాధ అనీ, తన ప్రేమ కథ ఎవరికైనా ఒక మధురభావనగా చెప్పాలనీ కలలూ కోరికలతో సతమతమై పోతుంటాడు ర్యాబోవిచ్‌. తన అందవికార రూపం, పేదరికం, తక్కువస్థాయి ఉద్యోగం, అన్నిటినీ మర్చిపోయేట్లు చేసింది ఈ అయాచిత అనుభవం. ఆమెను ప్రేయసి చేసింది, ఆరోజు చీకట్లో ఆమె ముఖం కూడా చూడకపోయినా. మిలిటరీ బెటాలియన్‌ మళ్ళీ ఆ ఊర్లో ఆగినప్పుడు విందుకు ఆహ్వానం అందుతుందనీ, ఈసారైనా ఆమె దర్శనం దొరుకుతుందనీ ఆశ అతన్ని ఈ వసంత కాలమంతా నిలువనివ్వలేదు. కానీ, తీరా ఆ ఊరు చేరేసరికి, ఇప్పుడసలు ఆ ఆసామి ఊర్లోనే లేడు. ఆ భవంతి, ఆ తోట, దానికి నది ప్రక్కనుంచి తోవ, నదిపైన ముచ్చటైన వంతెన అన్నీ అట్లాగే ఉన్నాయి, ‘‘ఒక్క ఆ గుండెబలిమి ఉన్న కోయిల పాట లేదు. నదిలో చంద్రుడు ఎర్రగా ఉన్నాడు, నీటిబుడగలు ఆయన ప్రతిబింబాన్ని పరిమాణంలో పెంచుతూ, ఇంతలో ముక్కలుగా తుంచుతూ, చంద్రుణ్ణి తమతో లాక్కెళ్ళుతాం అనుకుంటున్నాయా అన్నట్లు తన గుండా పోతున్నాయి.’’ ఉన్నట్లుండి అతనికి తన ఈ నిరాశ ఆశ్చర్యపడవలసిన ఒక విషయమే కాదు అనిపిస్తుంది. ఆమె తనకు కనపడుతుందనీ, ఇది ప్రేమేననీ ఇన్నిరోజులుగా అనుకోవటం ఎంత సహజమో, ఇప్పుడు అవన్నీ వ్యర్థమైన ఊహలు అని తెలియడమూ అంతే సహజం అనుకుంటాడు. ఈ నది ఆ రోజు ఎలా ప్రవహించిందో ఈనాడూ అలాగే ఏదీ పట్టించుకోకుండా ప్రవహించడమూ వింత కాదు. ‘‘నేనెంత బాధలో ఉన్నా లోకం ఏంటి ఇంత అందంగా వెలిగిపోతోంది, దీనికి మనసే లేదు!’’ అనే చెహొవ్ మరో సందర్భంలో, ‘‘ఈ సృష్టి అంతా ఎంత చక్కగా ఉంది, ఇక్కడ మనిషి తన మానవ మర్యాదలను మరిచిపోయి చేసే పనులు తప్ప!’’ అనీ అంటాడు. ర్యాబోవిచ్‌ మళ్ళీ అన్నీ నెమరు వేసుకుంటాడు. విధి ఒక అపరిచిత స్త్రీ రూపంలో హత్తుకోవటం, తర్వాత తనను వదలని midsummer night (day) dreams, ప్రస్తుతం వాస్తవమైన తన శోకం... ‘‘ఎంత అల్పమైన దయనీయ దౌర్భాగ్య జీవితం నాది!’’ అనుకుంటాడు. తన మనుషులను ఎంత అభావంగా చూపెట్టగలిగితే, వారికి పాఠకుల నుంచి అంత జాలి దొరుకుతుంది అనే కిటుకు తెలిసిన రచయిత చెహొవ్. సాంద్రమైన చిన్నకథకు మచ్చుతునక ఈ కథ.

‘‘గాడిదకు దుఃఖం తెలుస్తుందా’’ – ఫ్రెడరిక్ నీఛ.

‘‘గాడిదకు పన్నీరు వాసన తెలుస్తుందా’’ – తెలుగు సామెత.

చెహొవ్ హీరో గాడిద కాదు, కనీసం గాడిదగా మిగిలిపోడు; జీవితానికి ఒక నిర్దిష్ట ప్రయోజనమో పరమార్థమో ఉంటాయనుకుని బ్రతకడం వృథా ప్రయాస అనే స్పృహను, దాన్లోంచి వచ్చే యాతనను సమస్త మానవజాతి తరఫున భరించగల సార్థకజీవి.


మనుషులు ఎదిగే పరిణామక్రియను, వారి మనస్తత్వపు జీవితచరిత్రలను ఇటుకపై ఇటుకగా నిర్మించే ఒక్క చెహొవ్ తప్ప మరొకరు పట్టుకోలేరు. జీవకణ ప్రయోగశాలలో సూక్ష్మదర్శిని కింద జరుగుతుండే పరమాణు క్షణక్షణ పరివర్తనల వంటివే మనిషి మనస్సు, మెదడులలో నిరంతరం జరిగే మార్పులు. ఆ చలనగతులను పట్టుకోగల కన్ను చెహొవ్‌ది, వాటి కోసమే ఎదురు చూస్తుంటాడు, శిశువు శిరోదయం కోసం ఎదురుచూసే మంత్రసాని జాగరూకతతో.

పద్మజ సూరపరాజు

99403 44406

ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 01:43 AM