Chandrababu Naidus Visionary Path: చంద్రబాబు జ్ఞాన పథం
ABN , Publish Date - Oct 29 , 2025 | 02:05 AM
సమాజాలు కాలానుగుణంగా ప్రగతి మార్గంలో పయనించేందుకు దార్శనిక పాలకులు అవసరం. దూరదృష్టి, ఆత్మవిశ్వాసం, నిబద్ధత ఉన్న పాలకులే తమ దేశాలకు శీఘ్ర పురోగతి...
సమాజాలు కాలానుగుణంగా ప్రగతి మార్గంలో పయనించేందుకు దార్శనిక పాలకులు అవసరం. దూరదృష్టి, ఆత్మవిశ్వాసం, నిబద్ధత ఉన్న పాలకులే తమ దేశాలకు శీఘ్ర పురోగతి సాధించగలుగుతారు. ఈ విషయంలో గల్ఫ్ దేశాలు ప్రపంచానికే ఆదర్శప్రాయం. ఎడారి దేశాలు సంపద్వంత సీమలుగా వర్ధిల్లుతోన్న తీరుతెన్నులను నిశితంగా గమనించే భారతీయ రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అగ్రగణ్యుడు.
దుబాయితో చంద్రబాబుకు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. పర్యాటక రంగమే జీవనాడిగా ఉన్న దుబాయి, చమురు ఎగుమతి కేంద్రీకృత ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న ఆబుధాబిల అభివృద్ధి నమూనాలను ఆయన నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇటీవల దుబాయిని సందర్శించిన చంద్రబాబు, అక్కడ ప్రవాసులతో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ అభివృద్ధి విధానం గురించి చేసిన ప్రసంగం సామాన్యులు, మేధావులు అందరినీ ఆలోచింపజేసింది. జ్ఞాన ఆధారిత ఆర్ధిక వ్యవస్ధ విషయమై చంద్రబాబు దార్శనికత, విశాఖపట్టణంలో గూగుల్ డేటా సెంటర్ నేర్పాటు చేయనున్న నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది. ఐరోపా నుండి ఆసియాకు పయనించే సముద్రాంతర ఇంటర్నెట్ కేబుళ్ళన్నీ గల్ఫ్ నుంచి భారత్ మీదుగానే సమస్త ఆసియా దేశాలకు వెళ్తాయి, ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్‌తో పాటు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సైతం విశాఖపట్టణానికి వస్తున్నందున దుబాయి సభలో జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలను చంద్రబాబు వివరించిన విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నది. వర్షాభావ దుబాయి సిరిసంపదల నెలవుగా పరిణమిస్తుందని ఒకప్పుడు ఎవరూ ఉహించలేదని, అదే విధంగా రైతు బిడ్డలు ఐటీ ఇంజినీర్లుగా ఎదుగుతారని ఒకప్పుడు ఎవరూ భావించలేదని చంద్రబాబు అన్నారు. దూరదృష్టి, వినూత్న ఆలోచనలు, భద్ర భవిష్యత్తు నిర్మాణ సంకల్పంతోనే ఆ మేలు మార్పులు సుసాధ్యమయ్యాయని చంద్రబాబు అన్నారు. కుటుంబానికి ఒక్కరు చొప్పున ఐటీ ఇంజినీర్‌ను చేస్తానని 1990లలో తాను ప్రకటిస్తే హేళన చేశారని ఆయన గుర్తు చేశారు. భావితరాలకు అవసరమైన అధునాతన సాంకేతికత క్వాంటం కంప్యూటింగ్‌కు తాను నవ్యాంధ్రప్రదేశ్ నుండి శ్రీకారం చుట్టనున్నట్లుగా చంద్రబాబు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
చమురు ఆదాయం లేని దుబాయికి పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నది. కేవలం ఒకే ఒక్క విమానాశ్రయం ఆధారంగా దుబాయి ఏమిరేట్ ఏ విధంగా ప్రపంచ పర్యాటకుల గమ్యంగా ప్రభవించిందో చంద్రబాబు తన ప్రత్యక్ష అనుభవాలను ఉదహరిస్తూ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని రీతిలో 1,50,000 హోటల్ రూమ్‌లతో పర్యాటక రంగాన్ని ఈ ఎడారి నగరం అభివృద్ధి చేసిన తీరును వివరిస్తూ నీళ్ళు, వృక్షాలు లేని దుబాయి శరవేగంగా పురోగమిస్తుండగా అన్ని ఉండీ మనమెందుకు వెనుకబడి ఉంటున్నామో అలోచించాలని చంద్రబాబు అన్నారు. ప్రపంచ చమురు విపణిని శాసించే సౌదీ అరేబియాతో పాటు దుబాయి పొరుగు ఏమిరేట్ ఆబుధాబి కూడా డేటా సెంటర్ల ఏర్పాటుకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించిన చంద్రబాబు ఆబుధాబి చమురు కేంద్రీకృత విధానం నుంచి జ్ఞాన ఆధారిత ఆర్ధిక విధానం వైపు పురోగమిస్తున్న వైనాన్ని చంద్రబాబు ప్రశంసాపూర్వకంగా విపులీకరించారు.
రాజకీయాలకు అతీతంగా ఆవిష్కృతమైన చంద్రబాబు మనోగతం సభికులను స్ఫూర్తిదాయకంగా ఆకట్టుకున్నది. భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అక్కడి సంప్రదాయాలు, చట్టాలను గౌరవిస్తూ మెలగాలని హితవు చెప్పుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు దుబాయిలోని తెలుగు వారికి మాత్రమే కాకుండ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త ప్రవాస భారతీయులకూ ఒక సందేశాన్ని పంపారు. అమెరికాతో సహా కొన్ని దేశాలలో దీపావళి మొదలైన పండుగల సందర్భంగా భారతీయులు కొందరు హద్దులు మీరి వ్యవహరించిన తీరుపై విపుల వార్తా కథనాలు వెలువడిన దృష్ట్యా చంద్రబాబు హితోపదేశం వివేకవంతమైనది. గత మూడు దశాబ్దాలుగా దుబాయికి రాకపోకలు సాగిస్తున్న చంద్రబాబు స్థానిక ప్రవాసులతో సమావేశమవ్వడం ఇదే మొదటిసారి. దుబాయిలో పుట్టిన తొమ్మిదేళ్ళ వేమూరి హంశ్ మొదలు కాకినాడలో పుట్టి పెరిగి దుబాయిలో స్ధిరపడ్డ 92 ఏళ్ళ ఫాతిమా వరకు చాలామంది చంద్రబాబుతో భేటీ అయ్యారు. సమావేశ వేదికపై సుమారు ఐదు గంటల పాటు విసుగు, అలసట లేకుండా ఓపిగ్గా నిలబడిన చంద్రబాబు తనను పలకరించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ విడివిడిగా మాట్లాడి వారితో ఫోటోలు దిగారు.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి:
Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు
Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Read Latest AP News And Telugu News