Birsa Munda 150th Birth Anniversary: బిర్సాముండా స్ఫూర్తితో ఉద్యమించాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:23 AM
భారతదేశ చరిత్రలో ఆధిపత్యం, అణచివేతకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయుధం పట్టి ఉద్యమాలకు ఊపిరులూదారు ఆదివాసీలు. అనేక పోరాటాలకు పురుడుపోశారు.
భారతదేశ చరిత్రలో ఆధిపత్యం, అణచివేతకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం ఆయుధం పట్టి ఉద్యమాలకు ఊపిరులూదారు ఆదివాసీలు. అనేక పోరాటాలకు పురుడుపోశారు. మేడారం కేంద్రంగా సమ్మక్క సారక్క పోరాటం, బిహార్ కొండలలో పహాడీయుల తిరుగుబాటు, ‘జల్, జంగిల్, జమీన్’ కోసం జోడేఘాట్ కేంద్రంగా కొమురం భీమ్ పోరాటం, 1836–1860 వరకు రాంజీ నాయకత్వంలో తెల్లదొరలు, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో సమరశంఖం పూరించారు. తమ అస్థిత్వం కోసం ఆదివాసీలు చేసిన పోరాటాలు ఘనమైనవి. అలాంటి గొప్ప పోరాటాలను చేసిన ఆదివాసీల ఆరాధ్య నాయకుడు బిర్సాముండా. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బిర్సా చరిత్ర ఒక ప్రధాన ఘట్టం. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ సమీపంలో గల ఉలిహాట్ ప్రాంతంలో 1875 నవంబర్ 15న బిర్సాముండా జన్మించాడు. తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మిహాట్. ‘ముండా’ అనేది ఆ రాష్ట్రంలోని అతి ప్రాచీనమైన ఆదివాసీ తెగ కాగా, పుట్టిన రోజును బట్టి బిర్సా అనే పేరును ఆయనకు పెట్టారు. బిర్సా చిన్నతనం నుంచే ధైర్య సాహసాలు కలిగినవాడు. ఆయన బాల్యమంతా కడు పేదరికంలోనే గడిచింది. ఆదివాసీలపై జరుగుతున్న ఆణచివేతలు, అవమానాలను చూసి సహించలేకపోయాడు. ప్రారంభంలో ఆదివాసీ ప్రాంతాలు ‘గోండ్వానా రాజ్యాలు’గా స్వేచ్ఛగా విలసిల్లినా, ఆంగ్లేయుల రాకతో ఆదివాసీ రాజ్యాలు విచ్ఛిన్నమయ్యాయని గ్రహించాడు. అగ్రవర్ణాల దోపిడీపై గళమెత్తాడు. వడ్డీ వ్యాపారుల దోపిడీని ప్రశ్నించాడు. ‘ముండా’ ఆదివాసీలకు ప్రాథమిక హక్కులు కావాలని ‘జల్, జంగిల్, జమీన్’ కోసం విల్లంబులతో అడవిమార్గం పట్టాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా జరిగిన ‘మిలినేరియన్’ ఉద్యమానికి బిర్సాముండా నాయకత్వం వహించాడు.
పోరాటాన్ని ఉధృతంగా ముందుకు నడిపించాడు. ఆ ఉద్యమ సమయంలోనే బ్రిటిషు సేనలు దొంగచాటుగా బిర్సాను బంధించాయి. ఆయన్ను రాంచీలో జైలులో ఉంచి బ్రిటిషువారు చిత్రహింసలకు గురిచేశారు. 1900 జూన్ 9న ఆ జైలులోనే బిర్సాముండాను కాల్చి చంపారు. చనిపోయే నాటికి ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు! ఆదివాసీలపై అణచివేతకు, తెల్లదొరల అకృత్యాలకు, వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు బిర్సాముండా. నేటి ఆదివాసీ యువతరానికి ఆయన ఒక మార్గదర్శి, దిక్సూచి. బిర్సాముండా జ్ఞాపకార్థం, గౌరవార్థం మనదేశ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉంచారు.
భారతదేశంలో ఈ విధంగా గౌరవం, సత్కారాన్ని పొందిన ఏకైక ఆదివాసీ నాయకుడు బిర్సాముండా. తమ రాష్ట్రంలోని ఒక విమానాశ్రయానికి బిర్సాముండా పేరు పెట్టుకుని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. ఆ రాష్ట్రంలోని చాలా ప్రదేశాల పేర్లు, వ్యక్తుల పేర్లు కూడా బిర్సా పేరుతో ముడిపడి ఉంటాయి. ఇది ఆయనకు లభించిన గౌరవం. కానీ నేడు జార్ఖండ్ రాష్ట్రంలో ‘ముండా ఆదివాసీ తెగ’ అంతరించిపోయే స్థితిలో ఉంది. అస్థిత్వపు అంచున కొట్టుమిట్టాడుతోంది. నేటి పాలకవర్గం సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాతో ఆదివాసీ సమాజాన్ని అంతం చేస్తున్నది. పలు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే పరిశ్రమల పేరిట, ప్రాజెక్టుల పేరిట కొన్ని లక్షల ఆదివాసీ కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజ సంపద, సహజ వనరులపై విదేశీ సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు కన్నేశాయి. ఎనిమిది దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో కొన్ని ఆదివాసీ తెగలు ఇప్పటికే కానరాక, మరికొన్ని కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది.
కేంద్ర గిరిజన సంక్షేమశాఖ లెక్కల ప్రకారమే చూస్తే... దేశంలోని దాదాపు 570 గిరిజన తెగలలో అత్యంత వెనుకబడి, ఏ కోశానా అభివృద్ధికి నోచుకోని తెగలు 75 వరకూ ఉన్నాయి! వాటిలో 19 తెగల ఆదివాసీ జనాభా వెయ్యి కంటే తక్కువే. ఇది ఒక్క రాష్ట్రం పరిస్థితే కాదు, దేశంలో ఆదివాసీలు విస్తరించి ఉన్న 19 రాష్ట్రాల్లోని తెగలన్నిటి పరిస్థితి కూడా. మరోవైపు, అడవుల్లోని బాక్సైట్ నిక్షేపాల మీద బహుళజాతి పరిశ్రమలనే డేగలు వాలితే... ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నష్టపోతున్నది ఆదివాసీలే. ఈ దేశంలోని ఆదివాసీ బతుకులను బుగ్గిపాలు చేస్తున్నది సర్కారేనన్న సత్యం ప్రస్తుత సమాజానికి తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో దళారీ పాలకవర్గాలకు వ్యతిరేకంగా ‘ముండా’ ఆదివాసీ పోరాట యోధుడు ‘బిర్సాముండా’ ఉద్యమస్ఫూర్తిని పుణికిపుచ్చుకుని సామాజ్యవాద పాలకవర్గాలకు వ్యతిరేకంగా మేధావులు, ఆదివాసీ విద్యావంతులు, ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు, విప్లవ సంస్థలు ఆదివాసీలకు అండగా నిలవాలి. వారిని చైతన్యవంతం చేస్తూ ఆదివాసుల ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడాల్సిన తరుణమిది. అప్పుడే బిర్సాముండా ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆయన కలలుగన్న స్వరాజ్యం నెరవేరుతుంది.
వూకె రామకృష్ణ దొర ఆదివాసీ జర్నలిస్ట్ అసోసియేషన్
(నేడు బిర్సాముండా 150వ జయంతి)