Share News

EX Union Minister Chidambaram: ప్రతిపక్షాన్ని ఎన్నుకోని బిహార్‌ ఓటర్లు

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:13 AM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల తీర్పు వెలువడింది. ఓటర్ల మనసులో మాట ఆ తీర్పులో ప్రతిబింబించింది. అధికార కూటమికి 202 సీట్లు లభించగా ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌ బంధన్‌కు 35 సీట్లు మాత్రమే లభించాయి.

EX Union Minister Chidambaram: ప్రతిపక్షాన్ని ఎన్నుకోని బిహార్‌ ఓటర్లు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల తీర్పు వెలువడింది. ఓటర్ల మనసులో మాట ఆ తీర్పులో ప్రతిబింబించింది. అధికార కూటమికి 202 సీట్లు లభించగా ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌ బంధన్‌కు 35 సీట్లు మాత్రమే లభించాయి. ఈ ప్రజాతీర్పును సమస్త భారత పౌరులూ అంగీకరించి తీరాలి. రాబోయే కొత్త ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ మన శుభాకాంక్షలు. ఆ మాటకొస్తే మన శుభాకాంక్షలు, శుభాభినందనలకు బిహార్‌ ప్రజలే మరింత ఎక్కువగా యోగ్యులు. బిహార్‌ ఎన్నికల వార్తలు, ఎన్నికల పరిణామాల విశ్లేషణలు, కథనాలు నివేదించడంలో మీడియా తన విధ్యుక్త ధర్మ నిర్వహణను గర్వకారణంగా నిర్వర్తించలేదు. కొన్ని మీడియా సంస్థలు– దినపత్రికలు, టెలివిజన్‌ చానెల్స్‌– తొలుత కొంచెం భిన్న మార్గాన్ని అనుసరించినప్పటికీ అంతిమంగా గుంపులో గోవిందయ్యలే అయ్యాయి. క్షేత్ర స్థాయిలో వార్తలు సేకరించే విలేఖర్లు ముక్తకంఠంతో మాట్లాడారు: కులాభిమానాల ప్రాతిపదికన ప్రజలు ఓటు వేస్తారు; నితీశ్‌ కుమార్‌కు నష్టదాయకమయ్యేలా ప్రభుత్వ వ్యతిరేకత లేదు; తేజస్వి యాదవ్‌ ఎన్నికల ప్రచారానికి కొత్త శక్తినిచ్చారు కానీ, తన ఆకర్షణ శక్తిని రాష్ట్రీయ జనతాదళ్‌ సంప్రదాయక ఓటుబ్యాంకు పరిధి ఆవలకు విస్తరింపజేయలేకపోయారు; జన్‌ సురాజ్‌ నాయకుడు ప్రశాంత్‌ కిశోర్‌ కొత్త భావాలు తీసుకువచ్చారు. అయితే ఓటర్లు ఆయన్ను కొత్తగా రంగంలోకి వచ్చిన నాయకుడుగా, నాయకత్వ సామర్థ్యాలు పరీక్షింపబడని వ్యక్తిగా మాత్రమే పరిగణించారు. సరే, నరేంద్ర మోదీ ఓటర్లతో మమేకమవడం, ఓటర్లు ఆయన ఆకర్షణ శక్తిలో సమ్మిళితమవడం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? రాహుల్‌గాంధీ ఎంతకూ ఓట్‌ చోరీ, నిరుద్యోగిత అంశాలకే పరిమితమయ్యారు.


చెప్పుకోదగిన ఇతర విపక్ష నాయకుల తీరుతెన్నులూ ప్రభావశీలంగా లేవు. ఎన్నికల ఫలితాలు మీడియా ముక్తఘోషను సమర్థించాయి. ఏకైక కొత్త విషయం దస్‌ హజారీ (రూ. 10,000) నగదు బదిలీ. ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళకు పోలింగ్‌ ముందు, పోలింగ్‌ కాలంలోను, పోలింగ్‌ అనంతరం ఈ నగదు బదిలీ చేశారు. బిహార్‌ ప్రజల జ్ఞాపకశక్తి చాలా సుదీర్ఘమైనదిగా కనిపిస్తోంది. పదిహేను సంవత్సరాల లాలూప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య ప్రభుత్వాల పాలన (1990–2005)ను బాగా గుర్తుచేసుకున్నారు. అయితే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దించివేసినప్పుడు 16 సంవత్సరాల ప్రాయం కూడా లేని తేజస్వి యాదవ్‌నే అనేక అనర్థాలకు బాధ్యుడిని చేశారు! ఇరవై సంవత్సరాల నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వ పాలనను కూడా గుర్తు చేసుకున్నారు. అయితే అనేక రంగాలలో నితీశ్‌ పాలనా వైఫల్యంపై వారికి ఎటువంటి నిరసన లేదు! బిహార్‌ పేద రాష్ట్రమా? అంతులేకుండా నిరుద్యోగం తాండవిస్తున్న రాష్ట్రమా? ఉపాధిని వెతుక్కుంటూ కోట్లాది బిహారీలు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారా? రాష్ట్ర జనాభాలో అత్యధికులను అష్టదారిద్ర్యాలు కుంగదీస్తున్నాయా? విద్యావసతులు నాసిరకంగా ఉన్నాయా? ఆరోగ్య భద్రత సదుపాయాలు ఆందోళన కలిగిస్తున్నాయా? ‘మద్య నిషేధం’ ఉన్నప్పటికీ రకరకాల మద్యం స్వేచ్ఛగా అందుబాటులో ఉండడం లేదూ? ఈ ప్రశ్నలలో ప్రతి ఒక్కదానికీ ‘అవును’ అనేదే సరైన, స్పష్టమైన సమాధానం.


ఈ అసెంబ్లీ ఎన్నికలలో బిహారీలు ఓటు వేసిన తీరుతెన్నులకు ఎవరూ సహేతుకమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. సంజాయిషీ ఎవరు చెబుతారు? పాత్రికేయ ప్రముఖుడు ఒకరు తన కాలమ్‌లో నర్మగర్భంగా ఇలా వ్యాఖ్యానించారు: ‘బిహార్‌ నిన్నగాక మొన్న ఆలోచించినదాన్నే ఈ రోజు కూడా ఆలోచిస్తున్నది’. అది నిజమే కావచ్చుగానీ తాజా ఓటింగ్‌ తీరు తెన్నులకు సమంజసమైన కారణాలు బహుశా ఎన్నికల అనంతర సర్వేలలో వెల్లడయ్యే అవకాశమున్నది. సమస్త బిహారీల సహాయ సహకారాలతో మహాత్మాగాంధీ చరిత్రాత్మకంగా నిర్వహించిన చంపారన్‌ ఉద్యమ రోజుల స్ఫూర్తిని మళ్లీ ఆవాహన చేసుకోవాలని వర్తమాన బిహారీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అర్హతలు లేని ఉపాధ్యాయులను, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు లేని పాఠశాలలు, కళాశాలలను, ఎగ్జామ్‌ పేపర్స్‌ లీక్‌ను, పరీక్షలలో మూకుమ్మడి కాపీయింగ్‌ను, పరీక్షల ఫలితాలను కొంత మందికి అనుకూలంగా తారుమారు చేయడాన్ని, విలువలేని డిగ్రీలను, ప్రభుత్వోద్యోగాల రిక్రూట్‌మెంట్‌ ప్రహసనాలను బిహార్‌ విద్యార్థులు, యువజనులు ఇంకెంత మాత్రం సహించకూడదు. బిహార్‌ ప్రజలను ఒక ప్రత్యామ్నాయ దార్శనికతతో ఉత్తేజితులను చేయడంలోను, మార్పునకై ఒక ప్రగాఢ ఆకాంక్షను వారి మనసుల్లో నెలకొల్పడంలోనూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. ప్రశాంత్‌ కిశోర్‌ కొంతమేరకు ఇలా చేశారు గానీ ఆయన బరువు బాధ్యతలు చాలా పెద్దవి. వాటిని నిర్వర్తించడంలో ఎదురైన అనేక ప్రతిబంధకాలతో ప్రశాంత్‌ సతమతమయ్యారు. ఓటమికి ప్రధాన ప్రతిపక్షాలదే బాధ్యత. అపార ఆర్థిక వనరులు ఉంటే సరిపోదు. ఓటర్ల వద్దకు లక్షలాది కార్యకర్తలను పంపే సంస్థాగత సామర్థ్యముండాలి. ఎన్నికలలో విజయం లభించేది పార్టీ నాయకులు, అభ్యర్థులతో కాకుండా పార్టీ సంస్థాగత పటిష్ఠత, దీక్షాదక్షులైన కార్యకర్తల వల్లే అన్న సత్యాన్ని గుర్తించాలి. ఎన్నికలలో విజయం సాధిస్తున్న ఒక పార్టీ లేదా కూటమి తమ సంస్థాగత సామర్థ్యం కారణంగానే గెలుపును దక్కించుకుంటున్నాయి. ఓటర్లను పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చేలా కార్యకర్తలను పురిగొల్పకపోతే ప్రయోజనమేముంది? బిహార్‌లో భారతీయ జనతాపార్టీకి, జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీకి అటువంటి సంస్థాగత దన్ను ఉన్నదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తిరుగులేని రీతిలో రుజువు చేశాయి. బిహార్‌ ఎన్నికలలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సంశయాస్పద పాత్ర పోషించింది.


ఎన్నికలు సమీపించిన తరుణంలో బిహార్‌లో మాత్రమే ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమాన్ని చేపట్టింది. పోలింగ్‌ శాతం పెరుగుదలకు పాక్షిక కారణం ఓటర్‌ జాబితాలలో మొత్తం ఓట్లు తగ్గిపోవడమే. ఇది ‘సర్‌’ మహాత్మ్యమే సుమా! పోలింగ్‌ తేదీలు ప్రకటించడానికి పది రోజుల ముందు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిపై ఈసీఐ దృష్టి పెట్టలేదు. పోలింగ్‌ తేదీలు ప్రకటించడానికి ముందు ప్రారంమైన నగదు బదిలీ (ప్రతి కుటుంబంలోను ఒక్కో మహిళకు రూ. 10 వేల చొప్పున) ఎన్నికల ప్రచార సమయంలోనూ కొనసాగింది. ఈసీఐ ఏ దశలోను ఇందుకు అభ్యంతరం చెప్పలేదు. రూ.10వేల నగదు బదిలీ ఓటర్లకు లంచంగా ఇవ్వడమే, సందేహం లేదు. మరి ‍తమిళనాడులో సంక్షేమ పథకాల విషయమై ఈసీఐ ఎలా భిన్నంగా వ్యవహరించిందో చూడండి: రైతులకు నగదు మద్దతు పథకం మార్చి 2003లో ప్రారంభమయింది. 2004లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించగానే ఆ పథకం అమలును నిలిపివేశారు. ఉచిత కలర్‌ టీవీ పథకం 2006 నుంచి అమల్లో ఉన్నది. 2011లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడగానే ఉచిత కలర్‌ టీవీల పంపిణీని నిలిపివేశారు. బిహార్‌లో కూడా భారత ఎన్నికల సంఘం పక్షపాత ప్రవర్తన స్పష్టంగా కనిపించింది. ఈసీఐ ఎంతగా నియమ విరుద్ధంగా వ్యవహరించినప్పటికీ అధికార కూటమి ఎన్డీఏ ప్రశస్త విజయాన్ని సాధించిందని ఒప్పుకుని తీరాలి.


అధికార కూటమి అనేక హామీలు ఇచ్చింది. కొత్త ప్రభుత్వం ఆ వాగ్దానాలు అన్నిటినీ నెరవేరుస్తుందా? రాబోయే అయిదేళ్లలో ప్రభుత్వం తన నిర్ణయాలు, చర్యలకు జవాబుదారీ వహించేలా ఎవరు పూచీపడతారు? ఈ విషయం గురించే నేను మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నాను. బిహార్‌ ప్రజలు తమ రాష్ట్ర శాసనసభలో ఒక శక్తిమంతమైన ప్రతిపక్షం ఉండేలా ఓటు వేయలేదు. పర్యవసానంగా ప్రజలే ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అగత్యమేర్పడింది. ఓటు వేయడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని ప్రజలు భావించకూడదు. ప్రతిపక్షంగా వ్యవహరించడమనేది ఒక బృహత్తర బాధ్యత. ఓటు హక్కును వినియోగించుకోవడం కంటే సమున్నతమైన కర్తవ్యమది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Nov 15 , 2025 | 04:21 AM