Share News

Bihar Elections 2025: మహిళా ఓటరు మహత్యం

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:11 AM

పచ్చీస్‌ సే తీస్‌, నరేంద్ర ఔర్‌ నితీశ్‌’ అన్న ఎన్డీయే నినాదాన్ని బిహార్‌ ప్రజలు నిజం చేశారు. ఎంతగా అంటే, ఎన్నికల సర్వేలకు, ఎగ్జిట్‌ పోల్స్‌కు అందనంత. ఈ సర్వేలన్నీ అంచనావేసిన...

Bihar Elections 2025: మహిళా ఓటరు మహత్యం

‘పచ్చీస్‌ సే తీస్‌, నరేంద్ర ఔర్‌ నితీశ్‌’ అన్న ఎన్డీయే నినాదాన్ని బిహార్‌ ప్రజలు నిజం చేశారు. ఎంతగా అంటే, ఎన్నికల సర్వేలకు, ఎగ్జిట్‌ పోల్స్‌కు అందనంత. ఈ సర్వేలన్నీ అంచనావేసిన కనిష్ఠసంఖ్యకు మరో వందసీట్లు ఎక్కువే బిహారీలు ఎన్డీయేకు ఇచ్చారు. మహాగడ్బంధన్‌కు దాని కనిష్ఠంలో సగం కోతపెట్టారు. నితీశ్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా? అన్నచర్చ ఎప్పటిలాగానే సాగుతోంది. నితీశ్‌ పార్టీకంటే బీజేపీ ఓ గుప్పెడు సీట్లు ఎక్కువ తెచ్చుకోవడం, చెరో నూటొక్కస్థానాలకూ పోటీపడినా, బీజేపీ స్ట్రైక్‌రేట్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఈ చర్చ సహజం. బీజేపీ పెద్దలు ఎన్నోసార్లు సవినయంగా నితీశ్‌ నాయకత్వంలోనే తాము నడుస్తున్నామని చెప్పుకున్నా, రాష్ట్రాన్ని స్వయంగా ఏలాలన్న ఉత్సాహం రాష్ట్రస్థాయి నాయకులకు ఉండటం వారితో కొన్ని అనవసరపు వ్యాఖ్యలు చేయిస్తోంది. గతంలో, దీనికి సగం స్థానాలున్న నితీశ్‌ను గద్దెమీదే ఉంచిన బీజేపీ, ఈమారు కేంద్రంలో ఊతాన్ని కూడా ఇస్తున్న స్థితిలో కొత్త విన్యాసాలేమీ జరగకపోవచ్చు. నితీశ్‌ ఇమేజ్‌తో పోటీపడగల నేత బిహార్‌లో లేకపోవడం బీజేపీకి పెద్ద లోటు. సమీపగతంలోనే పలుమార్లు ప్లేట్లు ఫిరాయించిన నితీశ్‌ను బిహారీలు ఇంతగా నెత్తినపెట్టుకోవడం ఆశ్చర్యం. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇరవైయేళ్ళుగా అధికారంలో కొనసాగడం విశేషం. యాదవేతర ఓబీసీ కులాలు, మహాదళితులు, పస్మండా ముస్లింలకు ఆయన ఆధిపత్య కులాలనుంచి తమను కాపాడగల నాయకుడు. బీజేపీతో చేయి కలిపిన ముస్లిం పరిరక్షకుడు. అగ్రకులాల దృష్టిలో ఆయన హిందూత్వవాది. శాంతిభద్రతల పరిరక్షకుడనీ, మహిళాపక్షపాతి అనీ పేరుంది. దీనికితోడు, సరిగ్గా ఎన్నికలు ప్రకటించిన నాడే దాదాపు కోటి నలభైలక్షలమంది మహిళలకు వారి బ్యాంక్‌ ఎకౌంట్లలో నేరుగా పదివేల రూపాయలు పడటంతో ఇక తిరుగులేకపోయింది. తాను మళ్ళీ రాగానే ప్రతీ మహిళకూ మొత్తం మూడులక్షలు ముట్టేట్టు చూస్తానని నితీశ్‌ హామీ ఇచ్చారు. నెలకు ఆరువేలరూపాయల సగటు ఆదాయం కూడా లేని రాష్ట్రంలో ఈ భారీ మనీట్రాన్స్‌ఫర్‌ మహిళలను ఎంత ప్రభావితం చేసిందో కళకళలాడిన ఆ పోలింగ్‌ బూత్‌లు ఎప్పుడో స్పష్టంచేశాయి. ‍


తాము అధికారంలోకి వచ్చిన ఇరవైరోజుల్లోనే ప్రతీ కుటుంబానికీ ఓ సర్కారీ కొలువు ఇస్తానన్న ఆర్జేడీ అధినేత తేజస్వి హామీ కూడా ఈ నమ్మకం ముందు వమ్ము అయింది. రాహుల్‌గాంధీకి బిహర్‌ ఫలితాలు పెద్ద పరాభవం. ఎన్నికలసంఘం తొలిగా ప్రయోగించిన ‘సర్‌’ ప్రభావం ఏ మేరకన్న చర్చ అటుంచితే, పోటీచేసిన స్థానాల్లో పదోవంతు మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకుంది. రాహుల్‌ ఓట్‌చోరీ ఆరోపణలు, ఓట్‌ అధికారయాత్రలు జనాన్ని ఆకర్షించాయి కానీ, ఓటు వేయించలేకపోయాయి. అంబానీ, అదానీల ఆవాహన వారికి పట్టలేదు. నితీశ్‌, మోదీలమీద చేయాల్సిన యుద్ధం ఎన్నికల సంఘం మీదకు మళ్లిపోవడంతో ప్రజలకు విషయం ఎక్కలేదు, ఫలితం దక్కలేదు. బీజేపీకి సంస్థాగతంగా ఉన్న అనేక బలాలు, బాహువులు బిహార్‌లో కాంగ్రెస్‌కు లేకపోవడం పెద్ద దెబ్బ. పదిహేనేళ్ళలో ఎన్నడూ లేనంత ఘోర పరాజయం పొందిన ఆర్జేడీపని ఇక సరి అంటున్నవారికి, తనకు బీజేపీ, జేడీయూలకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని తేజస్వి సగర్వంగా గుర్తుచేయవచ్చు. ఓటువాటా తనకూ తగ్గలేదని కాంగ్రెస్‌ సైతం చెప్పుకోవచ్చు. కులాన్ని కాదు, కొత్త ఆలోచనలను, విధానాలను దృష్టిలో పెట్టుకొని ఓటువేయండి అంటూ, చదువు, ఉద్యోగం, వలసలు ప్రధాన ఎజెండాగా, ఆయా రంగాల్లో పేరున్న ప్రముఖులను అభ్యర్థులుగా నిలబెట్టిన ప్రశాంత్‌ కిషోర్‌ సర్వేలు ఊహించినకంటే ఘోరంగా చతికిలబడిపోయారు. ఆయన పార్టీ ప్రవేశం వల్ల, ప్రత్యక్షంగా గడ్బంధన్‌కు నష్టం జరిగి, ఎన్డీయేకు పరోక్షంగా లబ్ధిచేకూరిందని ఓ వాదన. తనకుమారుడి పట్టాభిషేకం చూడాలన్న లాలూ కల నెరవేరలేదు. నితీశ్‌ అనారోగ్యం మీద అధిక ప్రచారం జరిగినా, కొంత వాస్తవమూ లేకపోలేదు. ప్రస్తుతానికి గద్దెనెక్కినా, ఒకటి రెండేళ్ళలో మిత్రపక్షానికి అప్పగించాల్సిందే. బిహార్‌ ఫలితాలు మోదీకి కదనోత్సాహాన్ని కలిగించాయి. సమరశంఖాన్ని పూరించి, బెంగాల్‌ మీద తక్షణమే దండయాత్ర ప్రకటించగల శక్తినిచ్చాయి.

Updated Date - Nov 15 , 2025 | 04:11 AM