Folk Expression In Poetry: నవీన జాను తెనుగు కవి
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:23 AM
ప్రపంచీకరణ పెను దుమారం నుంచి కాపాడుకునే రక్షణ కవచాలు దేశీ రచనలు. దేశీయతలో భాగమైన జాను తెనుగుదనం జాతికి జవమూ జీవమూ. దేశీ కవిత్వం దేశీ రక్తమాంసాలతో నిర్మాణమవుతుంది....

ప్రపంచీకరణ పెను దుమారం నుంచి కాపాడుకునే రక్షణ కవచాలు దేశీ రచనలు. దేశీయతలో భాగమైన జాను తెనుగుదనం జాతికి జవమూ జీవమూ. దేశీ కవిత్వం దేశీ రక్తమాంసాలతో నిర్మాణమవుతుంది. సామాన్యంగా ఉంటూ నైసర్గిక స్వభావంతో అలరారుతుంది. వస్తువులో రూపంలో భావంలో ప్రకటనలో స్థల కాలాలను ప్రతిబింబిస్తుంది. ‘ఎవరిబిడ్డ! ఇది’ అంటే, ‘ఇది తెలుగువాడి బిడ్డ’ అని గర్వంగా చెప్పుకునేటట్టుగా ఉంటుంది. ఈ బాటలో తెలుగు సాహిత్యంలో పాల్కురికి బాటకు ఆధునిక కొనసాగింపు అన్నవరం దేవేందర్.
ప్రాచీనకాలంలో ‘‘జాను తెనుగు విశేషము ప్రసన్నతకు’’ అన్న మాటలకూ, ‘‘సరళముగాగ భావములు జాను తెనుగున ఇంపు పెంపుతో’’ అన్న భావనకూ అక్షర సాక్ష్యం నేటి అన్నవరం దేవేందర్ కవిత్వం. దేవేందర్ ఎనభయ్యవ దశకంలో ‘జీవగడ్డ’, ‘ప్రతిపక్షం’, ‘అన్న’, ‘ఆంధ్ర జ్యోతి’ మొదలైన పత్రికల్లో తెలంగాణ నుడికారంతో ప్రత్యేక శీర్షికలు నిర్వహించాడు. అప్పటి కల్లోల తెలంగాణ విప్లవ అలజడులను అధ్యయనం చేశాడు. తన ప్రాంతమైన హుస్నాబాద్ సాయుధ పోరాట కాలపు మొదటి ఎన్‌కౌంటర్‌కు, ఆసియాలోనే అతిపెద్ద స్తూప నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం. తొంభయ్యవ దశకంలోనే ప్రాంతీయ ఆధిపత్యపు అణచివేత తీవ్రమైంది. అస్తిత్వ ఉద్యమాలు, ప్రపంచీకరణ ప్రభావాలు పురుడుపోసుకున్నాయి. హుస్నాబాద్‌లో రిక్కల సహదేవరెడ్డి మొదలైన వారితో కలిసి 1986లో ‘నూతన సాహితి’ స్థాపకులలో దేవేందర్ ఒకడుగా ఉన్నాడు. ‘సిమాంట’ పేరుతో ప్రాంతీయ కవితా సంకలనం వెలువరించాడు. 1993లో దళిత బహుజన సోయితో మొదలైన ‘దళిత రచయితలు కవులు మేధావుల ఐక్య వేదిక’ (దరకమే) కార్యశాల నిర్వహణలో పాలుపంచుకున్నాడు. ఈ స్థల కాలాల మీదుగా అన్నవరం దేవేందర్ విప్లవ భావజాలం, ప్రాంతీయ భాషా సంస్కృతుల పట్ల మమకారం, దళిత బహుజన అస్తిత్వ ప్రకటన, ప్రపంచీకరణ వ్యతిరేక దృక్పథంతో ‘తొవ్వ’, ‘నడక’ సంపుటాలతో కవిగా బయలుదేరాడు. ప్రపంచీకరణతో కుదేలైన పల్లెల ముఖచిత్రాన్ని ‘మంకమ్మ తోట లేబర్ అడ్డా’గా ముద్రించాడు. ‘బుడ్డ పర్కలు’ నానీల సంపుటిలో కుల మత ఆధిపత్య దురహంకారాల మీద నిప్పు కణికలు విసిరాడు. 2001లో పురుడు పోసుకున్న ‘తెలంగాణ రచయితల వేదిక’ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి, ఆ వేదిక నుంచి వెలువడిన త్రైమాసిక పత్రిక ‘సోయి’లో విస్తృతంగా భావజాల వ్యాప్తికి పాదులు వేశాడు. ‘బొడ్డుమల్లె చెట్టు’, ‘పొద్దు పొడుపు’, ‘పొక్కిలి వాకిళ్ళ పులకరింత’ పుస్తకాల్లో తెలంగాణోద్యమ చైతన్యాన్ని కవితా ప్రవాహం చేశాడు. నాటి నుండి నేటి వరకు నాలుగు దశాబ్దాలుగా విరామం లేకుండా కవిత్వం రాస్తున్నాడు.
అన్నవరం కవిత్వం భాషలో భావంలో ఈ కాలపు కవులందరికన్నా భిన్నమైనది. అది వర్తమాన చరిత్రను, తెలంగాణ సాంస్కృతికతను ప్రజల భాషలో ప్రకటిస్తుంది. జాతీయత దేశీయత అతని నుడికారంలో వ్యక్తమవుతుంది. సాధారణంగా వచన రచనల్లోనే సామెతలు, జాతీయాలు, పలుకుబడులు, కాకువు వంటి వాటిని ఎక్కువగా ప్రయోగిస్తుంటారు. అన్నవరం కవిత్వంలో అచ్చమైన దేశీయతా జాను తెనుగు లక్షణాలను పుణికిపుచ్చుకున్న జీవద్భాషా పరిమళాలు వీస్తాయి. వస్తువు విషయంలో స్థానీయతకు ప్రాధాన్యతను ఇచ్చినా ఇతర అంశాలను కవిత్వం చేసేటప్పుడు దాన్ని కూడా స్థానిక వేషభాషలతో రాణింపజేస్తాడు. భావ స్ఫూర్తి కోసం వినూత్న పదబంధాలను రూపొందించడం పాఠకుడిని ఆశ్చర్య చకితుణ్ణి చేస్తుంది. నిత్య జీవితంలో దర్శించే సామాన్య వస్తువులను ఒక జెన్ తాత్వికునిలా కొత్తగా పరిచయం చేస్తాడు అన్నవరం. జీవితంలోని వివిధ సందర్భాల్లోని సున్నిత భావ స్పందనలను కవిత్వంలోకి తీసుకువచ్చి తన కవితా ప్రయాణాన్ని కొత్త దారుల్లో నడిపిస్తాడు. అలంకరణ సామాగ్రి అంతా పల్లె నేపథ్యం నుంచి దృశ్యమానం చేస్తుంది.
‘‘కళాత్మకంగా కుండను వానినట్లు
నాణ్యతగా చెప్పును ముడిచినట్టు
అందమైన చీరను నేసినట్టు
నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతాను’’ – అంటూ ఉత్పత్తి కులాల సృజన మూలమే తన కవితకు ఆయువుపట్టని స్పష్టంగా ప్రకటించాడు. ‘‘ఎల్లలు ఎన్ని దాటినా, నా మట్టి వాసనే నాకు పులకరింత, నా ప్రాదేశికత ముందు, ప్రపంచీకరణ గుడ్డ పేలిక, విస్తరిస్తున్న విశ్వీకరణకు, ప్రాంతీయాత్మే ప్రతిఘటన’’ అన్నప్పుడు అన్నవరం కవితలోని సూటిదనం మనల్ని ఆకట్టుకుంటుంది. ‘‘కోల్గేట్ యాప పుల్లను నమిలి మింగింది, రెక్సోనా గట్టి పిండిని ఎండగట్టింది, విమ్ బార్‌తో తౌడు కొట్టుకపోయింది, క్లినిక్ ప్లస్‌ల కుంకుడు కాయ మునిగింది’’ అన్న పాదాలలో ప్రపంచీకరణ ప్రభావాన్ని ప్రాంతీయ క్రియా పదాలతో స్పష్ట పరచడం అన్నవరం సరళాభివ్యక్తికి మచ్చు తునక. ప్రపంచీకరణతో పట్నం బాట పట్టిన రైతు కూలీల దీన స్థితిని ‘‘మంకమ్మ తోట లేబర్ అడ్డా మీద, బక్క చిక్కిన దేహాలన్నీ, లొట్టబోయిన కండ్లతో చూస్తున్నాయి’’ అన్న దృశ్యంతో కరుణ రసాత్మకంగా మనస్సులో ముద్రించాడు. ‘‘దొడ్డు దొడ్డు నిఘంటువులు ఓరకు పెట్టి, ప్రబంధాలన్నీ కాసేపు తనబ్బిల దాసుకోండ్రి, ఏరుకోండ్రి ఏరుకోండ్రి, నిఘంటువుల కెక్కని నిఖార్సయిన పదాలు, తేట తేట పదాలు సామెతల సౌరభాలు’’ అని ఒక పల్లెటూరి గొంతుతో పలకడం అన్నవరం కవిత ప్రత్యేకత. పదాలను పునరావృత్తి చేసి దీప్తిమంతం చేయడం, మనస్సులో స్థిరమయ్యేట్టు చెయ్యడం అన్నవరం కవిత్వంలో కనిపిస్తుంది.
అన్నవరం కవిత్వమంతా ఊరును కేంద్రంగా చేసుకొని ప్రపంచాన్ని దర్శింపజేసే రీతిలో ఉంటుంది. ‘‘ఇల్లు వాకిలే కాదు, మా ఊరంటే సుత, నాకు పెయ్యంత పులకరింత, బడి, బాయి, ఎద్దూ ఎవుసం, వాగులు వాడలు, నన్ను నన్నుగా తీర్చిదిద్దిన శిల్ప రహస్యాలు’’ అని తన కవితా శిల్పం ఊరి నుంచి తీసుకున్నదేననే విషయాన్ని గుర్తు చేస్తాడు. అన్నవరం పుస్తకాల పేర్లు, కవితల శీర్షికలు జాను తెనుగుతనంతో శోభిస్తాయి. ‘మంకమ్మ తోట లేబర్ అడ్డా’, ‘బుడ్డపర్కలు’, ‘పొద్దు పొడుపు’, ‘పొక్కిలి వాకిళ్ల పులకరింత’, ‘వరి గొలుసులు’, ‘గవాయి’, ‘ఊరి దస్తూరి’ వంటి పుస్తకాల పేర్లు దీనికి నిదర్శనం. ‘బీమారి’, ‘ఇగం’, ‘ఎటమటం’, ‘నీల్గుడు’, ‘పెయ్యికాక’, ‘బుదుర కిచ్చు’, ‘పంచగజ్జ పలారం’, ‘అగిర్త’, ‘సొక్కం’, ‘జిట్టికండ్లు’, ‘సడక్’, ‘దస్కత్’ వంటి ఎన్నెన్నో జాను పదాలు కవితా శీర్షికలై అలరిస్తాయి. జాను పదకల్పన అన్నవరంకు అల్కటి ముచ్చట. వీటిలో ఆధునిక పదజాలాన్ని కూడా వాడు కోవడం, ఆడుకోవడం కనిపిస్తుంది. ఉదాహరణకు: ‘అమెరికావురం’, ‘ఇడుపుల మాయ’, ‘పైస మొలక’, ‘పుస్తక వికసన’, ‘జియో సాలెగూడు’, ‘నెట్టురోగం’, ‘సెల్ గిచ్చుడు’, ‘వయసహంకారం’, ‘భయోమయం’, ‘ఎర్ర సెజ్’... వంటి వందలాది పదబంధాలు అన్నవరం సృజనాత్మక అభివ్యక్తిని సౌందర్యమయం, కళామయం చేస్తాయి. అన్నవరం కవిత్వ రూపంలో ఏ వస్తువునైనా తెలంగాణీకరించే ప్రత్యేకత ఉంది. తెలంగాణ నుడికారాన్ని నేర్పుగా వాడే శక్తి ఉంది. ఆధునిక నాగరిక భాషను తెలంగాణ నుడికారంలోకి తర్జుమా చేయగలిగే నైపుణ్యం ఉంది. కొత్త పదాలను, సమాసాలను పరికల్పన చేసే బహుముఖీన ప్రతిభ ఉంది. సందర్భోచితంగా భావ చిత్రాలు, మానవీకరణ, వ్యంగ్య భాష ద్వారా కవిత్వాన్ని దృశ్యీకరించే సొబగు ఉంది. ఆధునిక తెలుగు కవిత్వంలో అన్నవరం జాను తెనుగు కవిత్వానికి ప్రతినిధి అనడం సముచితమే.
బూర్ల వెంకటేశ్వర్లు
94915 98040
(అన్నవరం దేవేందర్ దాశరథి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా)
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..