Share News

RSS on National Languages: భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:23 AM

దేశంలో భాషా వివాదాలు తీవ్రమవుతున్న తరుణంలో ఆరెస్సెస్‌ అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్..

RSS on National Languages: భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే

దేశంలో భాషా వివాదాలు తీవ్రమవుతున్న తరుణంలో ఆరెస్సెస్‌ అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ ‘భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే’ అంటూ ఇటీవల ఓ ప్రకటన చేశారు. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి భాషకూ సమాన ప్రాధాన్యం ఉందని, ప్రాంతీయ భాషలంటూ లేవని ఆరెస్సెస్ స్పష్టం చేసింది. ఇది భాషా ఐక్యతకు సంబంధించిన చర్చలకు కొత్త, ఆశాజనకమైన కోణాన్ని అందించింది.


భారతదేశం భిన్న భాషలకు నెలవు. ప్రజల సంస్కృతికి, గుర్తింపునకు భాష ప్రతీక. పౌరుల్లో దేశ సమగ్రతను, ఐక్యతను పెంపొందించాలంటే భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, అన్ని భాషలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తూ, అన్ని భాషలనూ ఆదరించడం ద్వారానే భారతదేశం ఒక బలమైన దేశంగా ముందుకు సాగుతుంది. కానీ దేశంలో కొంతకాలంగా హిందీని జాతీయ భాషగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రజల నుంచి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం అధికారిక కమ్యూనికేషన్లలో, విద్యా విధానాల్లో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలు మరోసారి వివాదానికి దారితీశాయి. ఉదాహరణకు.. మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయాలంటూ ప్రభుత్వం సర్క్యులర్‌ను జారీ చేసింది. కానీ శివసేన (ఉద్ధవ్ థాక్రే), మహారాష్ట్ర నవనిర్మాణ సేన వంటి పార్టీలు దీన్ని వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దక్షిణాదిపై హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సినీ నటులు అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్ మధ్య ఇటీవల ట్విట్టర్‌లో జరిగిన వాగ్వివాదం.. వంటి ఘటనలు కూడా ఈ భాషా వివాదానికి జాతీయ స్థాయిలో రాజకీయ రంగులు పులిమాయి.


ఈ నేపథ్యంలో ఆరెస్సెస్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి ప్రకటనలో మరో కీలకమైన అంశం ‘విద్యను మాతృభాషలోనే బోధించాలి’ అనే సిఫార్సు. ఈ అంశం వెనుక శాస్త్రీయ, విద్యాపరమైన కారణాలు ఉన్నాయి. బోధన, అభ్యసన మాతృభాషలో జరిగినప్పుడే పిల్లలు ఆయా విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. తద్వారా వారిలో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన మెరుగుపడుతుంది. అలా కాకుండా చిన్నతనం నుంచే ఇతర భాషలను పిల్లలపై బలవంతంగా రుద్దడం వల్ల వారిపై అనవసరమైన మానసిక భారం పడుతుందని, ఇది వారి ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని భాషా శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు చెబుతున్నారు. 1956లో భాషా ప్రాతిపదికనే రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఇది ప్రజలకు స్వభాషలో పరిపాలనను అందించి, వారి సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించడానికి దోహదపడింది. ఈ విషయాన్ని కేంద్రం గుర్తించాలి. ప్రస్తుత ఆరెస్సెస్ ప్రకటనను ఆచరణలో పెట్టి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సహకార స్ఫూర్తితో భాషా వైవిధ్యాన్ని రక్షించి, ప్రోత్సహించినప్పుడే దేశంలో భాషా సామరస్యం సుస్థిరమవుతుంది. ఇది దేశ సమైక్యతకు, అభివృద్ధికి బలమైన పునాది.

– డా. రావుల కృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, హెచ్‌సీయూ

Updated Date - Jul 24 , 2025 | 12:23 AM