నారాయణబాబు కవిత్వ ఆల్కెమీ
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:25 AM
‘‘కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును’’ అని దేవరకొండ బాల గంగాధర తిలక్ ప్రకటిస్తూ ఓ నలుగురు కవుల పేర్లు ఇచ్చాడు. కానీ కవిత్వాన్ని ఆల్కెమీ (రసచర్య) చేయగల తెలుగుకవి శ్రీరంగం నారాయణబాబు...

‘‘కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును’’ అని దేవరకొండ బాల గంగాధర తిలక్ ప్రకటిస్తూ ఓ నలుగురు కవుల పేర్లు ఇచ్చాడు. కానీ కవిత్వాన్ని ఆల్కెమీ (రసచర్య) చేయగల తెలుగుకవి శ్రీరంగం నారాయణబాబు మాత్రమే! తన కాలం నాటి భావకవులు రాత్రి ఆకాశాన్ని పూలతోటగాను, నక్షత్రాలను పూలుగాను వర్ణన చేశారు. నారాయణబాబు ‘‘నల్లని త్రాచుకోరలు/ తెల్లని మశూచి కుండలు/ గగనమ్మున చుక్కలు’’ అని రాయగలిగాడు. తానూ, శ్రీశ్రీ తొలినాళ్లలో భావకవిత్వాన్ని రాశామని, అనంతర కాలంలో దానిని తామే విసిరికొట్టామని నారాయణబాబు అన్నాడు. పురిపండా అన్నట్లు ‘‘తొలిదినాల్లో నారాయణబాబు అచ్చమైన భావకవి. కట్టుబడిలో, జుత్తులో, వేషంలో కూడా!’’
కవిత్వంపై నారాయణబాబు తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటించాడు: ‘‘కవిత్వమంటే అతి మృదులమైనదీ, బహుసరళమైనదీ, మందుగుండులాంటిదీ. జాగ్రత్త! ఖబడ్దార్! సాంద్రతరమైన నిబిడమైన భాషావిపిన విటపీ వీథుల గంభీరత కాదు; గుబురులు గుబురులుగా గుమిగూడిన పాదపశ్యామల పత్రాళిలో అలముకొంటున్న నీరవ నీరంధ్ర భయదాంధకార జీమూతాళి!’’
1930–50 సంవత్సరాల నడుమ నారాయణబాబు రాసిన నలభై కవితల్ని ఆరుద్ర 1972లో ‘రుధిరజ్యోతి’ కవితా సంపుటిగా ముద్రించాడు. 47 ఏళ్ళ తరువాత 2019లో ఈ పుస్తకాన్ని విజయనగరం నుండి ఎన్. కె. బాబు పునర్ముద్రించాడు.
‘కపాలమోక్షం’ కవితలో శివుని తపస్సును ఉగ్రంగా, స్వభావసిద్ధంగా వర్ణిస్తాడు నారాయణబాబు. మునులూ, ప్రాణులూ శివుడిని తపస్సు వీడమని ప్రార్థిస్తారు. కళ్ళు తెరిచేసరికి చేతి లోని బ్రహ్మకపాలం నశించిపోతుంది. భిక్షాపాత్రగా కపాలం కావాలని ‘‘పటపట పళ్ళు కొరికినాడు’’ శివుడు. ‘‘తురకల గోరీలందున/ క్రైస్తవుల సమాధులందున/ హిందూ శ్మశానవాటుల/ కపాలములు వికవిక నవ్వినవి’’ అంటాడు. ఔను! మతం మానవులకే గాని, కపాలాలకు లేదు కదా! అదే సమయంలో భగత్ సింగ్‌ను ఉరితీస్తారు. ‘‘భారతవీరుని/ కపాల మొక్కటి/ కపర్ది చేతిని/ రివ్వున వాలింది’’ అని రాస్తాడు నారాయణబాబు, భగత్ సింగ్ పేరు చెప్పకుండానే! శివుని కంటి మంటకు చేతిలోని బ్రహ్మకపాలం నశిస్తే దాని స్థానంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పుఱ్ఱె చేరిందట. దేశభక్తుని పుఱ్ఱె బ్రహ్మకపాలం కంటే గొప్పదని ధ్వనిస్తోంది కదూ! పౌరాణిక ఇతివృత్తాన్ని నేరుగా తీసుకొని, ఆధునిక సంఘటనకు ముడిపెట్టి గొప్ప ఫలితాన్ని సాధిస్తాడు. ఈ కవిత చదివిన రోణంకి అప్పలస్వామి ‘‘నారాయణబాబు కవనం మన్ను నుంచి మానవులను సృష్టిస్తుంది,’’ అన్నాడు. ‘‘వెయ్యేళ్ళ తెలుగు కవితా భవనానికి నారాయణబాబు ఈ ‘కపాలమోక్షం’ ద్వారా ఒక ఆధునిక కవితా గవాక్షాన్ని ఆవిష్కరించాడు’’ అని విశ్లేషిస్తాడు సోమసుందర్.
‘ఊరవతల’ కవితలోని ఈ పంక్తులను చూడండి: ‘‘పోయిన ఆ యేటి నవ్వె/ పుక్కిట నెమరేసుకుంటు/ గండశిల నీడ లోన/ కనుమోడ్చెను/ గార్దభస్వామి’’ – ఇక్కడ కవి ఎండిన సెలయేరును వర్ణిస్తున్నాడు. కెరటాల పొంగును ఏటి నవ్వుగా ఉత్ప్రేక్షించాడు. ప్రస్తుతం ఏరు ఎండిపోయింది. ఆ పొంగును గాడిద తన నోటి నురుగుగా నది గతకాలపు ఉచ్ఛ స్థితిని నెమరు వేసుకుంటుందట. ‘‘బ్రహ్మజెముడు కంచె మధ్య/ పూర్ణిమ సంధ్యల్లోన/ గడియైనా ఉదయాద్రిని/ రుధిరజ్యోతై వెలిగే జాబిల్లి/ మృతశరీర ఆక్రమణ/ ఘటాకాశ అరుణారుణ/ రక్తసిక్త మోముతోడ.. గాజుకళ్ళ పురిటి పిల్ల!’’ తల్లిచే పారేయబడ్డ రక్తసిక్త పురిటిపిల్లను రుధిరజ్యోతై వెలిగే జాబిల్లిగా ఊహ చేయడం నారాయణబాబుకే తెలిసిన విద్య.
‘‘శ్రీశ్రీ కవిత ఛందస్సుల జలపాత వేగంతో ఉరకలిడి బాహ్యస్వరూపంతో పాఠకుణ్ణి లోగొంటే, నారాయణబాబు కవిత సెలయేటి మార్దవంతో పఠిత హృదయంలో చేరి అనంత భావజాలాన్ని ప్రేరేపుతుంది,’’ అని సోమసుందర్ తీర్పునిస్తాడు.
‘‘రుధిర జ్యోతిర్/ జ్వలనా లలనా/ ప్రియుండ!/ విప్లవ ఋషిని/ విద్రోహ కవిని,’’ అని రాస్తాడు నారాయణబాబు. రుధిరజ్యోతిర్జ్వలనాన్ని లలనతోను, ఋషిని విప్లవంతోనూ సంపర్కం చేయించి, కొత్తదైన రసాయన చర్యను కలిగిస్తాడు. పాఠకుల మనసుల్లో భావాన్ని గింగిర్లు కొట్టిస్తాడు. ‘విద్రోహం’ అనే పదం నజ్రుల్ ఇస్లాం ప్రభావంలో నారాయణబాబు రాశాడు. 1930ల్లో బంగ్లా మహాకవి నజ్రుల్ ఇస్లాం, హరీంద్రనాథ ఛటోపాధ్యాయల ప్రభావం దేశమంతటా ప్రసరించింది.
‘‘భారతీయ సంప్రదాయం ఇతని కవితలో చక్కగా జాలు వారుతూ ఉంటుంది; అధివాస్తవికత ఉందంటారే గాని నారాయణబాబు సర్రియలిస్టు కాదు. చివరికి ‘మౌన శంఖం’ అనే ఒక్క సర్రియలిస్టు కవిత రాశాడు. అంతే!’’ అని రోణంకి అప్పలస్వామి చెప్పిన మాటలు అక్షరసత్యాలు.
ప్రాచీన సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల వారి ‘ఆముక్తమాల్యద’ కావ్యం ఎలాంటిదో, ఆధునిక సాహిత్యంలో నారాయణ బాబు ‘రుధిరజ్యోతి’ అలాంటిది. ‘‘పలికితుత్ప్రేక్షోపమలు’’ అని కంఠోక్తిగా చెప్పుకున్న రాయలవారు ఉత్ప్రేక్షాలంకారాన్ని చాలాచోట్ల తన కావ్యంలో వాడుకున్నారు. నారాయణబాబు కూడ ‘రుధిరజ్యోతి’లోని కవితల్ని గొప్ప ఊహాశాలిత్వంతో రాశారు. ‘ఆముక్తమాల్యద’ ఆసాంతం రసవంతంగా ఉంటుంది. మనుచరిత్ర వరూధినీ ప్రవరుల ఘట్టం తరువాత చప్పగా ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం పెద్దన మనుచరిత్ర లాంటిది. మహాప్రస్థానం, ప్రాసక్రీడలు వదిలేస్తే ఇతర రచనలేవీ అంతగా చదవాలనిపించవు.
శ్రీరంగం నారాయణ బాబు, శ్రీశ్రీ తాతాసహోదరులు. వీరికి దగ్గరి బంధువు ఆరుద్ర. ముగ్గురూ సమకాలికులై, పొయ్యి పొక్కిళ్ళ లాంటి సాహిత్యమిత్రులు. 1906లో శ్రీమంతుల ఇంట జన్మించాడు నారాయణబాబు. వైవాహిక జీవితం సుఖమయం కాకపోగా, విదుషీమణి అయిన బాలవితంతువుతో ప్రేమలో పడ్డాడు. ప్రేమ పరిణయంగా మారకముందే ఆమె మరణించింది. ‘‘చూడలేని పాపిష్టి తుఫాను ఊడపీకె లతను/ మోడైపోయి మామిడి చెట్టు మొహము వేలవేసె’’ అని భగ్నహృదయంతో భావగీతాలను ఆలపించాడు. చివరలో తిండికి రొక్కట పడి 1961లో చనిపోయాడు.
దీర్ఘ సంస్కృత సమాసాలను తృణీకరించి, ఐదారు అక్షరాల సాదా పదాలే పాదాలుగా, అనితర సాధ్యమైన ఊహాశాలిత్వంతో కవితలు రాసిన వాస్తవికవాది, అతి నవ్యకవి శ్రీరంగం నారాయణబాబు. శ్రీశ్రీ ప్రకాశంలో, ప్రభావంలో కనుమరుగై, తెలుగు సాహితీలోకంలో పొందదగ్గ ప్రఖ్యాతి పొందలేని కవి. నారాయణబాబు, శ్రీశ్రీ వ్యక్తిత్వ, కవితా వైరుధ్యాలను టార్చ్ వేసి చూపించగల చిన్ని గ్రంథం సోమసుందర్ రచించిన ‘రుధిరజ్యోతిర్దర్శనం’. దానిని చదవకుండా ‘రుధిరజ్యోతి’ కవితా సంపుటిని అంచనా వేయడం, ఒడ్డున ఒంగొని నూతి లోతు ఎంతుందో చెప్పడమే!
గార రంగనాథం
98857 58123
ఇది కూడా చదవండి..
Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు
10th class Students: సార్, ఛాయ్ తాగండి, నన్ను పాస్ చేయండి
CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..
CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి
For Andhrapradesh News And Telugu News