Share News

Heart Touching Lines: ఇద్దరు బంగారు తల్లులు

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:06 AM

మీరు నా గుండెపై విచ్చుకున్న పూల రేకులు యదపై తారాడే రంగుల సీతాకోకలు పాలపుంతల నక్షత్ర వీధుల్లో ఆటలాడుకుని వస్తారు...

Heart Touching Lines: ఇద్దరు బంగారు తల్లులు

మీరు

నా గుండెపై

విచ్చుకున్న పూల రేకులు

యదపై తారాడే రంగుల సీతాకోకలు

పాలపుంతల నక్షత్ర వీధుల్లో

ఆటలాడుకుని వస్తారు

అప్పుడు మీ అరమోడ్పు కళ్లలో

మిరుమిట్లుగొలిపే కాంతి రజను

నడిసముద్రపు లోతుల్లో

మునకలేసి వచ్చుంటారు

అందుకే మీ స్పర్శకి

వెచ్చని ఇసుక తడి

ఊహాతీత లోకాల్లోని

తూనీగల్లా మోసుకొచ్చిన

ప్రేమ పుప్పొడి

నాలో ఆకలిదప్పుల్ని దహిస్తుంది

మీ బోసి నవ్వులు

నీటి బుడగ కాలానికి

దిశ నిచ్చిన ప్రాణ వాయువులు

మీ బుల్లి బుల్లి వేళ్ళ అంచులతో

నా గుండెపై రాసిన కవితలకి

కిన్నెర రాగాలు కడతాను

అప్పుడు నా హృదయం

సుగంధభరితమౌతుంది

నేను నాకు అత్యంత

విలువైనదానిలా కనిపిస్తాను

నాలో నాకే తెలీని

ఎన్నో ఆశలూ భావాలు

రంగులూ కాంతులూ అనుభూతులూ

మీతో పాటే చిగురించాయి

మీలాగే అందంగా పెరిగి పెద్దయ్యాయి

ఎన్నడూ లేని

భయాలు ఆందోళనల్ని

మీ కౌగిళ్ళ వెచ్చదనంలోంచి

నేనెదుర్కొన్నాను

అమ్మచెట్టుకు అల్లుకున్న

పూలతీగలు మీరు

మీకు నే దన్నుననుకుంటాను గానీ

మీరు లేని నాకు ఉనికి లేదు

మీకన్నీ నేర్పానని విర్రవీగినా

నిజానికి నేర్చుకున్నది నేనే-

రెక్కలొచ్చి ఎగిరినప్పుడు

మీ విశాల ఆకాశాన్ని నేనవుతాను

అలసిన మీ కాలిచక్రాలకి కందెన నేను

గెలుపోటముల బతుకాటలో

నవ్వినపుడు

మీ కన్నుల్లో వెలిగే కాంతి నేను

దుఃఖాలని ఎవరాపగలరు కానీ

మీ కన్నీటి చుక్కలన్నిటినీ

కాచి వడబోసి ముత్యాలుగా మలిచి

నా మెడకున్న తాళ్లతో

హారాలు కడతాను

జీవితపు మలుపుల్లో

సందిగ్ధపు దారులలో

అయోమయంగానో అసమంజసంతోనో

మీరు నన్ను వెతుక్కున్న రోజు

ఆ విలువైన హారాలు మీకు కానుకిస్తాను

ఇక్కడున్నా లేకపోయినా

ఎప్పటికీ

వాటికి పడబోయే చిక్కుముడులన్నిటినీ

విప్పుతూనే ఉంటాను.

కవిత కుందుర్తి

ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..

ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 01:07 AM