Satyagoura Chandradasa Prabhuji: భక్తి వెలుగుతో మన జీవితాన్ని వెలిగిద్దాం
ABN , Publish Date - Oct 19 , 2025 | 08:20 PM
‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పర్వదినం చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, వాటిని శ్రీకృష్ణునికి సమర్పించి, ఆపై ఇంటి ప్రాంగణంలో వరుసలలో అమర్చుతారు.
Deepavali: ‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పర్వదినం చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, వాటిని శ్రీకృష్ణునికి సమర్పించి, ఆపై ఇంటి ప్రాంగణంలో వరుసలలో అమర్చుతారు.
రాముని అయోధ్యా ప్రవేశం – విజయ దీపోత్సవం దీపావళి పండుగకు మూలం శ్రీరామాయణంలో ఉంది. రావణాసురుడిని సంహరించిన తర్వాత 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలోకి తిరిగి ప్రవేశించి, సింహాసనాన్ని అధిష్ఠించారు. శ్రీమద్భాగవతంలో (9.10.45) సోదరుడైన భరతుడు ఆహ్వానించగా, ఉత్సవ శోభితమైన అయోధ్యలో శ్రీరామచంద్రుడు ప్రవేశించెనని తెలుపబడింది. నాటి ఈ ఉత్సవమే నేటికీ దీపావళిగా కొనసాగుతోంది. అయోధ్య వాసులు వీధులన్నింటినీ విశేషంగా అలంకరించి, ఇంటి ముంగిళ్లలో రంగోలీలు వేసి (ముగ్గులు), అరటి తోరణాలతో దేవాదిదేవుడైన శ్రీరామచంద్రుడికి స్వాగతం పలికారు. వారి గౌరవార్థం జరుపుకునే ఈ దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.
గోవర్ధన లీల – శ్రీకృష్ణుడి ఆధ్యాత్మిక బోధ దీపావళి పర్వదినానికి ఉన్న మరో ప్రధాన విశేషం దామోదర లీల. దీనితో పాటు దీపావళి మరుసటి రోజున గోవర్ధన పూజ జరుపుకుంటారు. వ్రజవాసులు ఇంద్రునికి బదులు గోవర్ధనుడిని పూజించినందుకు ఇంద్రుడు ఆగ్రహించి కుండపోత వర్షాన్ని కురిపించగా, ఏడు సంవత్సరాల బాలుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో అవలీలగా ఎత్తి, వ్రజవాసులను, ఆవులను రక్షించాడు. ఈ లీల ద్వారా, శ్రీకృష్ణుడు తన భక్తులకు భగవంతునిపై అపారమైన విశ్వాసాన్ని కలిగించాడు. అంతేకాక, తనను సేవించడం కన్నా, తన ప్రియ భక్తులను (గోవర్ధనుడిని) సేవించడమే తనను మరింత ప్రసన్నుడిని చేస్తుందని శ్రీకృష్ణుడు లోకానికి తెలియజేశాడు.
అంధకారంపై భక్తి దీపం – సాత్విక దీపావళి దీపావళి వెలుగులు కేవలం నూనె దీపాలే కాదు, అంతర్ముఖ జ్ఞానానికి కూడా చిహ్నం. మనం జ్ఞాన దీపం ద్వారా మోహాంధకారాన్ని తొలగించాలని వేదాలు (“జ్ఞానదీపేన భాస్వతా”) సూచిస్తున్నాయి. మన హృదయాల్లోని అహంకారం, లోభం, అసూయ అనే చీకట్లను తొలగించే దీపం భక్తి మాత్రమే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. నేటి కాలంలో దీపావళి భౌతిక వినోదానికే పరిమితం అవుతున్నప్పటికీ, అసలైన దీపావళి అంటే మనసును శుద్ధి చేసుకునే ఆత్మసాధన పండుగ. నిజమైన ఆనందం భగవంతుని స్మరణ, హరినామ సంకీర్తన, సత్సంగం జరపడం ద్వారానే లభిస్తుంది. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే రావణులను రామ నామమే సంహరించగలదు.
ఆత్మ సాక్షాత్కారం పొందే మార్గం భగవద్గీత బోధ ప్రకారం, ప్రతి ఒక్కరూ తన మనస్సు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలి గాని అధోగతిపాలు చేసుకోరాదు. పరిశుద్ధమైన మనస్సే మంచి మిత్రుడు. ఆత్మసాక్షాత్కారం పొందగోరే సామాన్య వ్యక్తి ఆధ్యాత్మిక దీపావళిని ఈ విధంగా జరుపుకోవచ్చు:
యశోదా దామోదరునికి నెయ్యి దీపాన్ని సమర్పించి, ఇంటి ముంగిళ్లను దీపాలతో అలంకరించాలి. కార్తిక మాసంలో దామోదరునికి నేతి దీపాన్ని సమర్పించినవారు సమస్త పాపాల నుండి విముక్తులై శ్రీహరి ధామాన్ని చేరగలడని పద్మ పురాణం తెలియజేస్తుంది.
శ్రీకృష్ణ లీలలను శ్రవణం చేయాలి
పాలు, వెన్న, నెయ్యితో చేసిన మిఠాయిలను శ్రీకృష్ణునికి సమర్పించి, ఆ ప్రసాదాన్ని (నైవేద్యాన్ని) కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారందరికీ పంచిపెట్టాలి. ఈ ప్రసాద వితరణ శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైనది.
ప్రతిరోజూ కనీసం ఒక మాల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి
ఈ కార్తిక మాసంలో దామోదర వ్రతాన్ని ఆచరిస్తూ, భక్తి భావనతో ఈ పండుగలను జరుపుకుంటే ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొంది భగవంతుని లీలలో మనం కూడా భాగం కాగలము. ఈ దీపావళి భక్తి వెలుగుతో మన జీవితాన్ని ప్రకాశింపజేద్దాం! హరే కృష్ణ.

శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ
ఎం.టెక్ (ఐఐటి మద్రాస్),
అధ్యక్షులు, హరేకృష్ణ మూమెంట్ – హైదరాబాద్.
ఫోన్ నంబర్ : 96400 86664.
ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి