Economy: ఆర్థిక అక్షరాస్యతలో నూతన అధ్యాయం..
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:03 AM
భారతదేశంలో ఆర్థిక అవగాహన పెంపుదల, బాధ్యతాయుత రుణ విధానాల ప్రోత్సాహం దిశగా మరో కీలక అడుగు పడింది.

ముంబై: భారతదేశంలో ఆర్థిక అవగాహన పెంపుదల, బాధ్యతాయుత రుణ విధానాల ప్రోత్సాహం దిశగా మరో కీలక అడుగు పడింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్‌లో అగ్రగామి సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్, సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ) అపెక్స్ బాడీ సా-ధన్ చేతులు కలిపాయి. దేశవ్యాప్తంగా రుణాలపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా, రుణదాతలు, సూక్ష్మ రుణ గ్రహీతల మధ్య ఆర్థిక సాక్షరతను బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్యం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యమని ఆయా సంస్థలు వెల్లడించాయి.
ఎంఎఫ్‌ఐలకు సాధికారత...
ఈ సహకారం ఎంఎఫ్‌ఐల రుణ మూల్యాంకనం, పర్యవేక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. డేటా ఆధారిత విశ్లేషణలు, అధునాతన సాధనాలు, ప్రత్యేక శిక్షణల ద్వారా ఎంఎఫ్‌ఐలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక సమ్మిళితత్వాన్ని మరింత విస్తరించడం, బాధ్యతాయుతమైన రుణ పంపిణీకి ప్రోత్సాహం కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రకటించాయి. ఈ అవగాహన కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరువయ్యేలా బహుభాషల్లో డిజిటల్ కంటెంట్‌ను రూపొందించింది. కమ్యూనిటీ ఆధారిత విధానాన్ని అనుసరించి, ఎంఎఫ్‌ఐలు తమ వినియోగదారులకు రుణాలపై సరైన అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. తద్వారా, బాధ్యతాయుతమైన క్రెడిట్ అలవాట్లను పెంపొందించి, ఆర్థిక సేవలు తగినంతగా అందుబాటులో లేని మార్కెట్లలో ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
శిక్షణ, వర్క్‌షాప్‌లు...
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సా-ధన్, 230కి పైగా సూక్ష్మ రుణ సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు), బ్యాంకులను తన సభ్యులుగా కలిగి ఉంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ట్రాన్స్‌యూనియన్ సిబిల్, సా-ధన్ సంయుక్తంగా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి. క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత, డేటా వినియోగం, పటిష్టమైన రుణ వ్యవస్థ నిర్మాణం వంటి అంశాలపై ఎంఎఫ్‌ఐలు, వారి బృందాలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా మాడ్యూల్స్‌ను రూపొందిస్తాయి.
ఆర్థిక విశ్వసనీయతకు పునాది: భవేష్ జైన్
ట్రాన్స్‌యూనియన్ సిబిల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ భవేష్ జైన్ మాట్లాడుతూ.. "రుణాలపై అవగాహన కేవలం అప్పు తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాదు. ఆర్థిక ప్రపంచంలో నమ్మకాన్ని, విశ్వసనీయతను నిర్మించుకోవడానికి ఇది కీలకం. డిసెంబర్ 2024 నాటికి 13 కోట్ల మంది తమ సిబిల్ రిపోర్ట్, స్కోర్‌ను పరిశీలించారు. ఇది క్రెడిట్ గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. ఈ భాగస్వామ్యం ద్వారా, సూక్ష్మ రుణ సంస్థలు, వారి వినియోగదారులకు ఆర్థికంగా మరింత మెరుగైన భవిష్యత్తును అందించాలని మేము ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి: జీజీ మామ్మెన్
సా-ధన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ జీజీ మామ్మెన్ మాట్లాడుతూ, "గ్రామ స్థాయి నుంచి క్రెడిట్ అవగాహన కల్పించడం నిజమైన ఆర్థిక సమ్మిళితత్వానికి దారి తీస్తుంది. రుణ పాత్రను, జీవనోపాధి అవకాశాలను పెంచడంలో దాని ప్రభావాన్ని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు, వారు వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలో మరింత విశ్వాసంతో పాల్గొనగలరు. ఈ భాగస్వామ్యం ద్వారా కీలకమైన సమాచారం నేరుగా అవసరమైన వారికి చేరుతుందని విశ్వసిస్తున్నాం" అని తెలిపారు.