Side Hustles: సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే
ABN , Publish Date - Jul 14 , 2025 | 06:18 PM
నేటి జమానాలో ఆర్థిక భద్రత కోసం అనేక మంది సైడ్ ఇన్‌కమ్‌ల వైపు మళ్లుతున్నారు. మరి ఇలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

నేటి జమానాలో ఆర్థిక భద్రత కోసం అనేక మంది సైడ్ ఇన్‌కమ్‌పై దృష్టి పెడుతున్నారు. మంచి ఆదాయాలు ఉన్న వారు కూడా తమకున్న ఖాళీ సమయంలో అభిరుచులను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఆర్థిక భద్రతతో పాటు ఈ ఆదాయంతో చిరకాల కోరికలను కూడా తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నిస్తున్న వారి ముందున్న ప్రధాన ఆదాయ మార్గాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం (Best Side Hustles in 2025).
ఏదైనా ఒక సబ్జెక్టుపై మీకు పట్టు ఉంటే ఆన్‌లైన్ ట్యూటర్‌గా మంచి ఆదాయం పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు మీకు తెలిసిన సబ్జెక్టును బోధించి నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు. భాషలు మొదలు గణితం, ఫిజిక్స్ వరకూ మీకు నచ్చిన సబ్జెక్టులో ఆన్‌లైన్ ట్యూటర్‌గా మారేందుకు చెగ్ (Chegg), ప్రెప్లీ (Preply), టాపర్ (Toppr) వంటి వేదికలు అవకాశం కల్పిస్తున్నాయి.
సైడ్ ఇన్‌కమ్ కోరుకునే వారు వర్చువల్ అసిస్టెంట్‌గా కూడా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. సంస్థలకు అడ్మినిస్ట్రేటివ్ అంశాలు, ఈమెయిల్ మేనేజ్‌మెంట్, షెడ్యూలింగ్, సోషల్ మీడియా వ్యవహారాల్లో సహాయకారిగా ఉంటూ ఆదాయం పొందొచ్చు. మీకున్న నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి సంస్థలు మంచి జీతనాతాలు చెల్లిస్తాయి. ఇలాంటి అవకాశాలు అప్‌వర్క్, ఫైవర్ వంటి వేదికల్లో అందుబాటులో ఉన్నాయి.
నేడు అనేక సంస్థలకు వెబ్‌సైట్స్ ఉంటున్నాయి. అయితే, ఇవి వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో టెస్టు చేసే బాధ్యత వెబ్ టెస్టర్‌దే. వెబ్‌సైట్ స్పీడు, ఉపయోగాలు వంటివన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. వెబ్ టెస్టర్‌గా చేయాలనుకుంటే యాప్‌సియారా, బగ్‌రాపర్ట్స్ వంటి వేదికల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మీ ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చుకునేందుకు ఇది మంచి మార్గం
నేటి జమానాలో ఫుడ్, ఇతర వస్తువుల హోం డెలివరీ ఎందరికో ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. సైడ్ ఇన్‌కమ్ కావాలనుకునే వారికీ ఇది మంచి ప్రత్యామ్నాయం. జోమాటో, ఊబర్ ఈట్స్, స్విగ్గీ, జెప్టో వంటి సంస్థల్లో డెలివరీ పార్టనర్ అవకాశాలు బోలెడన్ని ఉంటాయి.
పెంపుడు శునకాలను వాకింగ్‌కు తీసుకెళ్లే డాగ్ వాకర్‌లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. తీరక లేకుండా ఉండేవారు డాగ్ వాకర్‌ల సేవలు ఎక్కువగా వినియోగించుకుంటారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి.
కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలు, ప్రకటనలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతోందో ముందుగానే తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇందుకోసం ఫోకస్ గ్రూప్ పేరిట కొందరిని ఎంపిక చేసి తమ ఉత్పత్తులపై వారి అభిప్రాయాలను తీసుకుంటాయి. ఇలాంటి అవకాశాల కోసం ప్రయత్నించొచ్చు.
వృత్తినిపుణులకు సహాయకులుగా ఉండే వారికి మంచి డిమాండ్ ఉంది. బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ వ్యక్తిగత షెడ్యూలింగ్, పర్సనల్ షాపింగ్, ఇతర చిన్న చిన్న పనులను చక్కబెట్టడం పర్సనల్ అసిస్టెంట్స్ బాధ్యత. సైడ్ ఇన్‌కమ్ పొందేందుకు ఇదీ ఓ మంచి మార్గం.
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాల్లో పిల్లలకు కాపలాగా ఉండే బెబీసిట్టర్‌లు, నానీలకు కూడా భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. కొన్ని గంటలు లేదా రోజుల పాటు ఇలా చేసి సైడ్ ఇన్‌కమ్ పొందొచ్చు. కేర్ డాట్ కామ్, అర్బన్ సిట్టర్ వేదికల్లో ఈ అవకాశాల కోసం ప్రయత్నించొచ్చు. అర్బన్ కంపెనీ, నో బ్రోకర్ వంటి వేదికల్లో హౌస్ క్లీనింగ్ అవకాశాల ద్వారా మంచి ఆదాయం పొందొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి
చాట్‌జీపీటీతో 30 రోజుల్లో రూ.10 లక్షల అప్పు తీర్చేసిన మహిళా రియల్టర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి