Pan Card Loan Scam: మీ పేరు మీద మరొకరు లోన్ తీసుకున్నట్టు అనుమానం ఉందా.. ఇలా చేయండి
ABN , Publish Date - Jul 29 , 2025 | 08:20 AM
మీ పేరు మీద మరొకరు లోన్ తీసుకున్నట్టు అనుమానంగా ఉందా? ఇలాంటి సందర్భాల్లో యూజర్లు వెంటనే తమ క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రిపోర్టులో అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ స్కామ్‌లు, ఐడెంటిటీ చోరీ ఇతర సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. పేరు, అడ్రస్, ఆధార్, పాన్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు చోరీ చేసి గుట్టుచప్పుడు కాకుండా లోన్‌లకు దరఖాస్తు చేస్తుంటారు. మరికొందరు ఏవేవో వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మీ పాన్ కార్డు కూడా ఇలా దుర్వినియోగమై ఉండొచ్చన్న అనుమానం కలిగినప్పుడు ఏం చేయాలో ఈ కథనంలో చూద్దాం.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, మీ పాన్ కార్డును దుర్వినియోగ పరిచి ఎవరైనా రుణం పొందినట్టు అనుమానంగా ఉంటే ముందు క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోవాలి. ఇందుకోసం సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్వీఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వెబ్‌సైట్‌ల సాయం తీసుకోవచ్చు. వీటిల్లో రుణాల రికార్డులన్నీ ఉంటాయి. యూజర్ల అభ్యర్థన మేరకు ఉచితంగానే ఇవి క్రెడిట్ రిపోర్టును ఇస్తాయి. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించాలి. తప్పుడు అకౌంట్ వివరాలు, అనుమతి లేని లోన్ ఎంక్వైరీలు ఉన్నాయేమో చెక్ చేయాలి. అనుమానాస్పద సంస్థల లావాదేవీలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి.
ఇక వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమైనట్టు రూఢీ అయితే వెంటనే రిపోర్టులోని రుణదాతకు సమాచారం అందించాలి. ఆ రుణం మీరు తీసుకోలేదని స్పష్టంగా తెలియజేయాలి. ఈ లోన్ ప్రస్తావన ఉన్న క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్‌లో కూడా అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేయాలి. స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ యూనిట్ విభాగంలో కూడా కంప్లెయింట్ చేయొచ్చు.
పాన్ కార్డును కేవలం 18 ఏళ్లు పైబడిన వారికే కాకుండా మైనర్‌లకూ ఇస్తారు. కంపెనీలు, పార్టనర్‌షిప్ ఫర్మ్స్, ఎల్ఎల్‌పీ, ట్రస్టులు, సొసైటీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్, భారత్‌లో ఆదాయం పొందే విదేశస్తులకూ పాన్ కార్డును జారీ చేస్తారు.
ఇవీ చదవండి:
మైనర్లకూ పాన్ కార్డు ఇస్తారని తెలుసా.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే