PAN Card For Minors: మైనర్లకూ పాన్ కార్డు ఇస్తారని తెలుసా.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
ABN , Publish Date - Jul 27 , 2025 | 02:45 PM
మైనర్‌లు కూడా పాన్ కార్డు పొందేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం అనుమతిస్తోంది. మరి పిల్లలకు ఏయే సందర్భాల్లో పాన్ కార్డు అవసరమవుతుందో, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: పాన్ కార్డు అంటే కేవలం పెద్దలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది పిల్లలకూ కీలకమే. ఆర్థిక వ్యవహారాల్లో అడ్డంకులు లేకుండా ఉండేందుకు పాన్ కార్డు అవసరం. పిల్లల భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికకు పాన్ కార్డు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం, మైనర్లూ పాన్ కార్డు పొందొచ్చు.
సాధారణంగా పిల్లల ఆదాయాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ పరంగా చాలా సందర్భాల్లో పెద్దల ఆదాయంలో కలిపి చూపించినప్పటికీ కొన్ని సార్లు పిల్లల పాన్ కార్డులు కూడా అక్కరకు వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇతర పెట్టుబడి సాధనాల్లో పిల్లలను నామినీగా చేర్చాలనుకుంటే పాన్ కార్డు అవసరం. నటన, స్పోర్ట్స్, ఇతర వ్యాపకాల ద్వారా పిల్లలకు ఆదాయం వస్తుంటే ట్యాక్స్ మేనేజ్‌మెంట్ కోసం పాన్ కార్డు తప్పనిసరి. కొన్ని రకాల స్కాలర్‌షిప్ అబ్ధిదారులకు పాన్ కార్డు తప్పనిసరి.
ఇక 18 ఏళ్ల లోపు ఉన్న వారి కోసం పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అడ్రస్ ప్రూఫ్, గుర్తింపు కార్డు, చిన్నారి అడ్రస్ ప్రూఫ్, గుర్తింపు కార్డు ఉండాలి. అప్లికేషన్‌లో రాసిన వివరాలకు ఈ డాక్యుమెంట్స్‌లోని వివరాలకు మధ్య ఎలాంటి తేడా ఉండకూడదు.
ఇక మైనర్‌ల పాన్ కార్డు దరఖాస్తు కోసం ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇందులో ‘కొత్త పాన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మైనర్ దరఖాస్తుదారుడి పూర్తి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని అప్లికేషన్ ఫార్మ్‌లో నింపాలి. క్యాప్చా ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. అన్నీ మరోసారి సరిచూసుకున్నాక ‘ప్రొసీడ్ విత్ పాన్ అప్లికేషన్ ఫార్మ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ వద్ద ఉన్న డాక్యుమెంట్ ప్రూఫ్స్, ఆధార్ వివరాలను కూడా జత చేయాలి. అనంతరం ఆన్‌లైన్‌లో ఫీజు కూడా చెల్లించాలి. ఇలా దరఖాస్తు చేసుకున్నాక, వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తరువాత 15 రోజుల లోపు కార్డు జారీ అవుతుంది.
ఇవీ చదవండి:
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..