Share News

Ola: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలాకు షాక్ తప్పదా?

ABN , Publish Date - Jul 15 , 2025 | 08:37 PM

రాష్ట్రంలో అనుమతులు లేని ఓలా షోరూమ్‌లను మూసివేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Ola: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలాకు షాక్ తప్పదా?
Ola Electric compliance problems

ఇంటర్నెట్ డెస్క్: అనుమతులు లేని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ల మూసివేతకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 450 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే, 90 శాతం షోరూమ్‌లల్లో వాహనాల నిల్వకు సంబంధించిన అనుమతులు లేవని సమాచారం.

వాహనాల విక్రయాల పరంగా ఓలా ఎలక్ట్రిక్‌కు మహారాష్ట్ర కీలకం. దేశంలో అధిక శాతం ఓలా ఈవీ టూవీలర్‌ల అమ్మకాలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అయితే, షోరూమ్‌లకు వాణిజ్య సర్టిఫికేట్‌, ఇతర అనుమతులు లేని కారణంగా ఓలా ఎలక్ట్రిక్ ఇక్కట్లు ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది.


ఈవీ మార్కెట్‌లో ఓలాకు ఇప్పటికే ఎదురుగాలులు వీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కేవలం 60 వేల ఓలా ఎలక్ట్రిక్ వాహనాలే అమ్ముడుపోయాయి. మరోవైపు, టీవీఎస్, బజాజ్ వంటి సంస్థలు కూడా రంగంలోకి దిగడంతో ఎలక్ట్రిక్ మార్కెట్‌లో పోటీ తీవ్రమైంది. జూన్ నెల అమ్మకాల్లో ఈ రెండు సంస్థలు ఓలాను అధిగమించాయి.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు రూ.347 కోట్ల నుంచి రూ.428 కోట్లకు పెరిగాయి. రెవెన్యూ కూడా దాదాపు రూ.828 కోట్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది లెక్కలతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం తక్కువ. ఓలా ఈవీ వాహనాల విక్రయాలు తగ్గడంతో పాటు ఇతర సంస్థల నుంచి పోటీ పెరగడం ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బ్లూమ్‌బర్గ్ అంచనా కంటే ఈసారి ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు తక్కువగా ఉండటం సంస్థకు ఊరటనిచ్చే అంశం.


ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..

సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 08:48 PM