Share News

Foxconn China Engineers: చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:04 PM

భారత్‌‌లోని చైనా నిపుణులు స్వదేశానికి తరలిపోతున్న వైనంపై కేంద్రం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, పరిస్థితిని సరిదిద్దేందుకు యాపిల్ సంస్థ ముందు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కేంద్రం భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Foxconn China Engineers: చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్
Foxconn India

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఐఫోన్‌ల తయారీకి కీలకంగా ఉన్న వందల మంది చైనా నిపుణులు సొంత దేశానికి తరలిపోతున్న వైనంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లోని ఫాక్స్‌కాన్ యూనిట్‌లో ఐఫోన్‌లను అసెంబుల్ చేస్తున్న విషయంలో తెలిసిందే. ఇక్కడ చైనా నిపుణులు పనిచేస్తున్నారు.

చైనాపై ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో యాపిల్ సంస్థ ఐఫోన్ తయారీ కార్యకలాపాలను భారత్‌లో చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు యాపిల్ వాణిజ్య భాగస్వామి ఫాక్స్‌కాన్‌కు చెందిన భారతీయ యూనిట్లలో ఉత్పత్తిని పెంచింది. ఈ క్రమంలో కొందరు చైనా నిపుణులు భారత్‌ను వీడటంపై కలకలం మొదలైంది. భారత్‌లో ఐఫోన్‌ల తయారీకి ఆటంకాలు ఏర్పడతాయేమోనన్న ఆందోళన పెరిగింది.

ఈ పరిస్థితిపై ప్రభుత్వం స్పందించింది. తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితిని తట్టుకునేందుకు యాపిల్ వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది యాపిల్, ఫాక్స్‌కాన్‌లకు చెందిన అంశమని అధికార వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.


మొబైల్ ఫోన్ తయారీకి వినియోగించే ఉపకరణాలన్నీ చైనా నుంచి తెప్పిస్తున్నారు. వీటి నిర్వహణలో చైనా నిపుణులకు అనుభవం ఎక్కువ. స్వదేశానికి తిరిగి వెళ్లిన చైనీయుల్లో అధిక శాతం మంది ఫోన్ అసెంబ్లీ లైన్ కార్యకలాపాలు, ఫ్యాక్టరీ డిజైన్, పరికరాల వినియోగంలో శిక్షణ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఫాక్స్‌కాన్ యూనిట్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చైనా నిపుణులు తరలిపోవడం ఐఫోన్ 17 తయారీపై ఎలాంటి ప్రభావం చూపదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో ఉత్పత్తిని పెంచేందుకు ఫాక్స్‌కాన్ ప్రయత్నిస్తోందని చెబుతున్నాయి.


ఇవీ చదవండి:

బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 06:29 PM