Share News

Credit Score Improvement: క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:29 PM

క్రెడిట్ కార్డు లేకుండా క్రెడిట్ స్కోరు పెరగదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. రుణ చెల్లింపుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్కోర్ సులువుగా మెరుగవుతుందని భరోసా ఇస్తున్నారు.

Credit Score Improvement: క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..
How to Build Good Credit Score

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో చిన్న మొత్తాల్లో లోన్‌లు కావాలన్నా మంచి క్రెడిట్ స్కోరు ఉండటం తప్పనిసరి. కస్టమర్ల సిబిల్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అయితే, క్రెడిట్ కార్డు లేకపోతే క్రెడిట్ స్కోరును మెరుగుపరచడం కష్టమని కొందరు భావిస్తుంటారు. ఇది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. మరి క్రెడిట్ స్కోరును మెరుగు పరుచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

కొందరికి క్రెడిట్ కార్డు పొందేందుకు తగిన ఆర్థిక అర్హతలు ఉండవు. మరికొందరు వివిధ కారణాల రీత్యా క్రెడిట్ కార్డును వినియోగించరు. ఇలాంటి వారందరూ ఇతర మార్గాల్లో తమ క్రెడిట్ స్కోరును మెరుగు పరుచుకోవచ్చు. ఏ రకమైన అప్పు తీసుకున్నా క్రమం తప్పకుండా ఈఎమ్‌ఐలు చెల్లిస్తూ ఉంటే క్రెడిట్ స్కోరు ఈజీగా మెరుగవుతుంది. మీరు తీసుకున్న సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ (తనఖా లేని) రుణాలు అన్నీ జాగ్రత్తగా తీర్చేస్తే సిబిల్ స్కోరు మెరుగవుతుంది. స్వల్ప వ్యవధిలో ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేసుకుంటే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఒక లోన్ తీర్చేశాక కొంత విరామం తరువాత అవసరమైతే మరో రుణానికి దరఖాస్తు చేసుకోవాలి.


ఏ తరహా రుణం తీసుకున్నా ఈఎమ్ఐలను సక్రమంగా చెల్లించడమే క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు ముఖ్య సాధనమని నిపుణులు చెబుతున్నారు. గృహోపకరణాల కోసం స్వల్ప మొత్తాల్లో లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. తదుపరి తీసుకునే లోన్‌లు మరింత త్వరగా మంజూరు అవుతాయి. దీని వల్ల రుణగ్రహీతల బాధ్యతాయుత వైఖరి ఆర్థిక సంస్థలకు అర్థమవుతుంది. అత్యవసర సందర్భాల్లో నిధులకు కటకట ఉండదు.

ఇక క్రెడిట్ స్కోర్‌పై నిత్యం ఓ కన్నేసి ఉంచాలని కూడా నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న తప్పులు కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సమస్యలను ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అవసరమైన సందర్భాల్లో వెంటనే రుణం లభిస్తుంది.


ఇవీ చదవండి:

సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 05:39 PM