Sunita Williams Safe Return: సునీత విలియమ్స్ బృందం అంతరిక్ష యాత్ర విజయవంతం.. అభినందనలు తెలిపిన ఏపీ శాసనసభ
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:15 AM
సుదీర్ఘ అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని సురక్షితంగా భూమ్మీదకు చేరిన సునీత విలియమ్స్, ఇతర ఆస్ట్రొనాట్స్‌కు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

అమరావతి: భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బృందం సురక్షితంగా భూమ్మీదకు చేరుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా సునీత విలియమ్స్ బృందానికి అభినందనలు తెలిపింది. సునీత విలియమ్స్ ఈరోజు భూమి పైకి సురక్షితంగా తిరిగి రావటం శుభపరిణామని శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.
సునీతకు ఇది మూడో అంతరిక్ష యాత్ర. వివిధ కారణాల రీత్య ఈసారి ఆమె ఏకంగా 286 రోజులు అంతరిక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో, ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారు. ఇది యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని ఏపీ శాసన సభ స్పీకర్ వ్యాఖ్యానించారు. శాస్త్రీయ పరిశోధనలపై సునీతకు ఉన్న ఆసక్తి, పట్టుదల, క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడని ఆమె ధైర్య సాహసాలు ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. మానవాళి నిరంతర ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమని అన్నారు.
Also Read: త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్.. పర్యటన ఖరారు
నేటి తెల్లవారుజామును సునీత విలియమ్స్ స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ అనే వ్యోమనౌకలో భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్ర జాల్లో ఆమె ప్రయాణిస్తున్న డ్రాగన్ క్యాప్సూల్ పారాషూట్‌ల సాయంతో సురక్షితంగా దిగింది. దీంతో, ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరదించినట్టైంది.
ఇక సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ 45 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్ర కారణంగా శరీరకంగా బలహీనపడ్డ వారు మళ్లీ కోలుకునేందుకు, భూవాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టనుంది. ఇద్దరు ఆస్ట్రొనాట్స్‌కు తమ శరీర లక్షణాలకు అనుగూణంగా వైద్యులు చికిత్సలు ప్లాన్ చేశారు. భూమ్మీదకు చేరిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించారు.
Also Read: భూమ్మీదకు సురక్షితంగా చేరిన సునీతా విలియమ్స్.. నెక్స్ట్ జరిగేది ఇదే..
ఇక వ్యోమగాములను భద్రంగా భూమ్మీదకు చేర్చినందుకు స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిషన్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మస్క్‌పై కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Latest and Andhrapradesh News